సినిమా వ్యాపారాలలో జరిగిన అనేక మార్పుల నేపథ్యంలో ఆధునిక కాలంలో చిత్రాలు నేరుగా వంద రోజులు ప్రదర్శించబడటం అసాధ్యం అయిపోయింది. ఈ తరుణంలో అనువాద చిత్రాల వసూళ్లు పెరిగినా, దీర్ఘ కాలిక ప్రదర్శనలు మాత్రం సాధించలేకపోతున్నాయి. కానీ ఈ ఏడాది తెలుగు లోకి అనువదించబడిన విజయ్ ఆంథోనీ చిత్రం బిచ్చగాడు మాత్రం ఈ ఆంక్షలకు మినహాయింపుగా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు భాషలోనూ ఘన విజయం సాధించి నేరుగా 100 రోజులు ప్రదశించబడింది. కేవలం తెలుగు రాష్ట్రాలలో పాతిక కోట్లకి పైగా వసూళ్లు సాధించి పెద్ద నిర్మాణ సంస్థల్ని సైతం ఉలికిపాటుకు గురి చేసింది.
బిచ్చగాడు ఇచ్చిన ప్రోచ్చాహంతోనే బిచ్చగాడు 2 చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం యావత్ దేశాన్ని కుదిపేస్తున్న నల్ల ధనం నిర్మూలననే కథాంశంగా చేసుకుని బిచ్చగాడు సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించటానికి ప్రణాళిక సిద్ధం చేశారు నిర్మాతలు. మరి చిత్రీకరణ దశలోకి చేరాక నిర్మాణ వ్యయం ఎంతకి చేరుతుందో చూడాలి. అయితే ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషలతో పాటు మలయాళ కన్నడ భాషలలోనూ విడుదల చెయ్యటానికి యోచిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే చిత్ర నిర్మాణానికి పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తున్నారు అని తెలుస్తుంది.