Venezuela : వెనిజువేలాలో దాడికి ట్రంప్.. ఆగ్రహానికి అసలు కారణమదేనట

వెనిజువేలాలో అమెరికా జోక్యానికి అసలు కారణం పెట్రోడాలర్ వ్యవస్థేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి

Update: 2026-01-05 03:06 GMT

వెనిజువేలాలో అమెరికా జోక్యానికి అసలు కారణం పెట్రోడాలర్ వ్యవస్థేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డాలర్‌కు సవాల్‌గా యువాన్‌లో చమురు విక్రయాలు మారడంతో ట్రంప్ వెనిజువేలాపై చర్యలకు దిగారంటున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. పైకి మాత్రం అమెరికా వెనిజువేలాలో జోక్యం చేసుకోవడానికి కారణం డ్రగ్స్, ఉగ్రవాదం లేదా ప్రజాస్వామ్యం అని చెబుతున్నారని, వాస్తవం అది కాదని, అమెరికన్ డాలర్‌ ఆధారిత పెట్రోడాలర్ వ్యవస్థే అసలు అంశమని విశ్లేషకులు వాదిస్తున్నారు.

ఒప్పందం మేరకు...
1974లో అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చమురు విక్రయాలు డాలర్లలోనే జరగాలి. అందుకు ప్రతిఫలంగా సౌదీకి సైనిక రక్షణ కల్పించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందమే డాలర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను సృష్టించి, అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి పునాది అయింది. వెనిజువేలాకు 303 బిలియన్ బ్యారెల్ల నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వలుగా భావిస్తున్నారు. సౌదీ అరేబియాకన్నా ఎక్కువగా, ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 20 శాతం వాటా వెనిజువేలాదే. అయితే 2018లో వెనిజువేలా డాలర్‌పై ఆధారపడకుండా ఉండాలని ప్రకటించింది. చమురు విక్రయాలకు డాలర్లకు బదులు చైనా యువాన్, యూరో, రూబుల్ వంటి కరెన్సీలను స్వీకరించడం మొదలుపెట్టింది.
బ్రిక్స్ లో చేరే ప్రయత్నం...
బ్రిక్స్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసింది. స్విఫ్ట్‌ను దాటవేసేలా చైనాతో నేరుగా చెల్లింపు మార్గాలు నిర్మించింది. ఇది పెట్రోడాలర్ వ్యవస్థకు సవాల్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు చమురు కొనుగోలు చేయాలంటే డాలర్లు అవసరమయ్యే పరిస్థితి మారితే, డాలర్‌కు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో గతంలో డాలర్‌కు సవాల్‌ విసిరిన దేశాలపై జరిగిన చర్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. 2000లో ఇరాక్ డాలర్లకు బదులు యూరోలలో చమురు విక్రయిస్తామని ప్రకటించిన తర్వాత 2003లో ఆ దేశంపై దాడి జరిగింది. 2009లో లిబియా నేత గడాఫీ బంగారం ఆధారిత ఆఫ్రికన్ కరెన్సీ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత 2011లో నాటో దాడులు జరిగాయి.
ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలతోనే...
ఇప్పుడు వెనిజువేలా కూడా డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు విక్రయాలు చేయడం, చైనా, రష్యా, ఇరాన్‌లతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం అమెరికాకు ఆందోళన కలిగించిందని విశ్లేషణలు చెబుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రూబుల్, యువాన్‌లలో చమురు విక్రయిస్తోంది. ఇరాన్ చాలా కాలంగా డాలరేతర లావాదేవీలు కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా కూడా యువాన్‌లో చెల్లింపులపై చర్చలు జరుపుతోంది. చైనా స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా సీఐపీఎస్ వ్యవస్థను విస్తరిస్తోంది. బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీల్లో లావాదేవీలపై దృష్టి పెట్టాయి. వెనిజువేలా బ్రిక్స్‌లో చేరితే ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్, ఉగ్రవాదం వంటి కారణాలు ఈ జోక్యానికి చూపిస్తున్నప్పటికీ, వాటికి తగిన ఆధారాలు లేవన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాన్ని ప్రస్తావించినా, ఎన్నికలు లేని దేశాలతో అమెరికా సన్నిహితంగా ఉండటం ఉదాహరణగా చూపుతున్నారు. డాలర్ ఆధిపత్యం బలవంతంతో కొనసాగుతోందన్న భావన ప్రపంచ దేశాల్లో పెరిగితే, డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాల వెతుకులాట మరింత వేగం పెరుగుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News