Iran - Israel War : ఆరో రోజుకు చేరుకున్న యుద్ధం...మధ్యప్రాచ్యంలో టెన్షన్

అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేసిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్మత్ ప్రకటించారు.

Update: 2026-03-05 01:58 GMT

Israeli tanks maneuver near the Israel-Lebanon border, in northern Israel

అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేసిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్మత్ ప్రకటించారు. ఇరాన్‌పై దాడులతో పాటు ఇజ్రాయెల్ లెబనాన్‌లో ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా మిలిటెంట్ గుంపుపై దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం విస్తరిస్తుండగా, మరిన్ని దాడులకు ముందు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి చేయాలన్న ‘వార్ పవర్స్’ తీర్మానాన్ని అమెరికా సెనేట్ తిరస్కరించింది. ప్రతినిధుల సభలోనూ ఇలాంటి బిల్లు పెట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్‌లో దానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆమోదమైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది.

పౌరుల తరలింపు చర్యలు వేగవంతం...
ఇరాన్‌లో వెయ్యికిపైగా, లెబనాన్‌లో 50 మందికిపైగా, ఇజ్రాయెల్‌లో దాదాపు డజను మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆయా దేశాల అధికారులు తెలిపారు. యుద్ధం మొదటి రెండు రోజుల్లోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి లక్ష మందికిపైగా ప్రజలు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిలో నౌకాయానంపై ఇరాన్ దాడుల తర్వాత చమురు ధరలు ఎగిశాయి. ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే బుధవారం ప్రారంభంలో అమెరికా మార్కెట్లు కొంత స్థిరంగా కనిపించాయి. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం రెండు సైనిక విమానాలను పంపాలని నిర్ణయించింది. పరిస్థితులు అనుకూలిస్తే తమ పౌరులను తరలిస్తామని విదేశాంగ మంత్రి విన్ స్టన్ పీటర్స్ తెలిపారు. దుబాయ్–ఆక్లాండ్ వాణిజ్య విమానాలు ప్రస్తుతం నడవడం లేదు. మధ్యప్రాచ్యంలో సుమారు మూడు వేల మంది న్యూజిలాండ్ పౌరులు ఉన్నారని అధికారులు చెప్పారు. “ఎప్పుడు, ఎలా తరలింపు సాధ్యమవుతుందో చెప్పలేం. అయితే అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలనుకుంటున్నాం” అని పీటర్స్ అన్నారు.
కువైట్ తీరంలో పేలుడు...
ఇరాన్‌పై సైనిక చర్యలు మొదలైన తర్వాత అక్కడే చిక్కుకున్న అమెరికన్ల కోసం అమెరికా విదేశాంగ శాఖ చార్టర్ విమానాలు ప్రారంభించింది. ఒక విమానం ఇప్పటికే బయలుదేరిందని తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది వెల్లడించలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ నుంచి విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో కువైట్ తీరానికి సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. బ్రిటన్ సైన్యం నిర్వహిస్తున్న యూకేఎంటీవో కేంద్రం ప్రకారం ఒక ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు అనుమానం. చిన్న నౌక అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. కారణంపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఇరాన్ నౌకలకు మైన్లు అతికించి దాడులు చేసినట్లు గుర్తుచేశారు.
సెనేట్‌లో వార్ పవర్స్ తీర్మానం తిరస్కారం...
ఖతార్ రాజధాని దోహాలోని అమెరికా రాయబార కార్యాలయం సమీప ప్రాంతాల నుంచి నివాసితులను తాత్కాలికంగా తరలిస్తున్నామని ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అదనపు ప్రమాద సూచనలు వెల్లడించలేదు.47–53 ఓట్ల తేడాతో వార్ పవర్స్ తీర్మానం సెనేట్‌లో విఫలమైంది. కెంటకీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పౌల్ అనుకూలంగా ఓటేశారు. పెన్సిల్వేనియాకు చెందిన డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఫెట్టర్ మ్యాన్ వ్యతిరేకంగా ఓటేశారు. ఈ తీర్మానం ద్వారా మరిన్ని దాడులకు ముందు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. మెయిన్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలియన్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. అణ్వాయుధ సామర్థ్యం గల ఇరాన్‌ను సహించలేమని ఆమె వ్యాఖ్యానించారు.
లెబనాన్‌లో దాడులు...
బీరూట్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం కనీసం రెండు దాడులు చేసింది. హారెట్ హ్రెయిక్ ప్రాంతంలో ముందుగా ఖాళీ చేయాలని హెచ్చరిక జారీ చేసింది. ప్రాణనష్టం వివరాలు వెంటనే వెల్లడించలేదు. బీరూట్ విమానాశ్రయ రోడ్డుపై డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు.ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థలు పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌లో డ్రోన్ పేలుడు చోటుచేసుకుని ఇళ్లకు నష్టం కలిగింది. దక్షిణాఫ్రికా పౌరులు పరిమిత వాణిజ్య విమానాల్లోనే వెంటనే తిరిగి రావాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఉల్లంఘిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి శాంతి దళాలు పేర్కొన్నాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. యుద్ధం ఆరో రోజుకు చేరుకోగా, మరిన్ని దాడుల భయం కొనసాగుతోంది.


Tags:    

Similar News