సైప్రస్‌పై డ్రోన్ దాడి.. యూరప్‌లోకి యుద్ధ విస్తరణ సంకేతాలు

“భూభాగమే భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మాట నిజమైతే, దానికి సజీవ ఉదాహరణ సైప్రస్ అవుతుంది

Update: 2026-03-04 01:52 GMT

A phrase "British bases out," hangs during an anti-war rally in the southern city of Limassol, Cyprus

“భూభాగమే భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మాట నిజమైతే, దానికి సజీవ ఉదాహరణ సైప్రస్ అవుతుంది. చిన్నదైనా వ్యూహాత్మకంగా కీలక స్థానం ఈ దీవి సొంతం. గ్రీకులు, పర్షియన్లు, రోమన్లు, ఒట్టోమన్లు, బ్రిటిష్ పాలకులు వరుసగా ఆధిపత్యం చెలాయించారు. మధ్యప్రాచ్యానికి అతి సమీపం, మూడు ప్రధాన మతాల పుట్టినిల్లు అనే గుర్తింపు ఉంది. తరువాత విస్తారమైన ఇంధన వనరులు – ఇవన్నీ సైప్రస్ ప్రాధాన్యాన్ని పెంచాయి. స్వతంత్ర దేశంగా దాదాపు 66 ఏళ్లు పూర్తి చేసుకున్న సైప్రస్ మళ్లీ మధ్యప్రాచ్య ఉద్రిక్తతల్లో చిక్కుకుంది. కారణం, ఇక్కడ ఉన్న బ్రిటన్‌కు చెందిన రెండు పెద్ద సైనిక స్థావరాలు. వలస పాలన కాలం నాటి అవశేషాలే ఇవి.

అర్ధరాత్రి డ్రోన్ దాడి...
సోమవారం అర్ధరాత్రి తరువాత, ఇరాన్ తయారీ ‘షాహెద్’ డ్రోన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు కు చెందిన అక్రోటిరి స్థావరంలోని అత్యాధునిక రాడార్ వ్యవస్థలను తప్పించుకుని లోనికి చొచ్చుకెళ్లింది. వెంటనే టైఫూన్ యుద్ధవిమానాలు, ప్రపంచంలో అత్యాధునికంగా భావించే ఎఫ్-35 యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. డ్రోన్‌ను కూల్చివేశాయి. అయితే రన్‌వే సమీపంలోని విమాన హ్యాంగర్‌కు స్వల్ప నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎవరూ గాయపడలేదు. అయినా ఈ దాడి అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం యూరప్ భూభాగానికి విస్తరించే సూచనగా కనిపిస్తోంది. 1974లో టర్కీ దాడి తరువాత సైప్రస్ నేలపై మూడో దేశం నుంచి జరిగిన తొలి దాడి ఇదే.మధ్యాహ్నం సమయానికి మరో రెండు డ్రోన్లను యుద్ధవిమానాలు అడ్డుకున్నాయి. తొలి దాడి యాదృచ్ఛికం కాదనే సందేశం ఇది ఇచ్చింది.
హిజ్బుల్లా పాత్రపై...
డ్రోన్ ఎక్కడి నుంచి ఎగిరిందనే విషయం స్పష్టం కాలేదు. అయితే లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు గుంపు హిజ్బుల్లా పాత్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. యూకే ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ అమెరికాకు తమ స్థావరాలు వినియోగించుకోవడానికి అనుమతిచ్చిన నిర్ణయం కారణం కాదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది. డ్రోన్ దాడి ఆయన ప్రకటనకు ముందే ప్రారంభమైందని వాదించింది. అయితే ఇరాన్ లేదా హిజ్బుల్లా బ్రిటన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా స్థావరాన్ని కాకుండా కేవలం 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్రోటిరినే లక్ష్యంగా చేసుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్రోటిరి స్థావరం, పశ్చిమంలో ఎపిస్కోపీ గారిసన్, తూర్పున డెకెలియా గారిసన్ కలిపి సైప్రస్‌లో బ్రిటన్‌కు చెందిన విస్తారమైన సైనిక సముదాయం ఉంది. మొత్తం విస్తీర్ణం సుమారు 99 చదరపు మైళ్లు. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి సమయంలో అక్రోటిరి ప్రధాన సరఫరా కేంద్రంగా పనిచేసింది. ఇప్పటికీ మధ్యప్రాచ్యంపై నిఘా వేసే యూ-2 గూఢచారి విమానాలు ఇక్కడే ఉన్నాయి.
పశ్చిమ వైపు మలుపు...
స్వాతంత్ర్యం తర్వాత తొలి దశల్లో సైప్రస్ తటస్థ విధానాన్నే అనుసరించింది. తూర్పు–పశ్చిమ దేశాల మధ్య సమతుల్యం పాటించాలనుకుంది. యూరోపియన్ యూనియన్ సభ్యత్వంతో పశ్చిమ దేశాల శిబిరంలో చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఎన్నికయ్యాక పశ్చిమ, అమెరికా అనుకూల ధోరణి స్పష్టమైంది. ఆయన సైప్రస్‌ను యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల మధ్య వారధిగా నిలబెట్టాలని కృషి చేస్తున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలతో దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలు బలోపేతం చేశారు. డ్రోన్ దాడి తరువాత “సైప్రస్ ఏ సైనిక చర్యలోనూ పాల్గొనదు. ఇప్పటివరకు పాల్గొనలేదు. భవిష్యత్తులోనూ పాల్గొనదు” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. సైప్రస్ విజ్ఞప్తిపై గ్రీస్ నాలుగు ఎఫ్-16 యుద్ధవిమానాలు, రెండు ఆధునిక ఫ్రిగేట్లను పంపింది. ఫ్రాన్స్ ఒక ఫ్రిగేట్‌తో పాటు భూస్థాపిత డ్రోన్ నిరోధక, క్షిపణి నిరోధక వ్యవస్థలు పంపనుంది. జర్మనీ యుద్ధనౌక పంపే అవకాశముంది. బ్రిటన్ కూడా అక్రోటిరి రక్షణకు నౌక, హెలికాప్టర్లు పంపుతున్నట్లు ప్రకటించింది.
బ్రిటన్ స్థావరాల నీడ...
సైప్రస్ ప్రభుత్వ విధానాలపై బ్రిటన్ సైనిక స్థావరాల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఏ సైనిక చర్యకు ముందు తమకు సమాచారం ఇవ్వాలని సైప్రస్ చెబుతున్నా, అది అధికారిక బాధ్యత కంటే మర్యాదపూర్వక ప్రక్రియ మాత్రమే. యేల్ ఫెలో, పోలిటేయా థింక్ ట్యాంక్ అధ్యక్షురాలు అన్నా కౌక్కిడెస్-ప్రోకోపియూ సైప్రస్ పరిస్థితిని బిల్లియర్డ్స్ టేబుల్‌పై మూలన మరిచిపోయిన బంతితో పోల్చారు. “ఇతర బంతులు ఢీకొనగానే అది అకస్మాత్తుగా గుంటలో పడుతుంది” అన్నారు.“మనం ఒక వైపు ఎంచుకున్నాం. ఇప్పుడు దాని ఫలితాలు ఎదుర్కోవాల్సిందే. భౌగోళిక పరిస్థితుల వల్ల కలిగే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని ఆమె వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News