ఛార్టెట్ విమానాలకు పెరిగిన డిమాండ్.. సంపన్నులు లక్షల యూరోల ఖర్చు

ఇరాన్‌ యుద్ధం గల్ఫ్‌ ప్రాంతం అంతటా వ్యాపించడంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు

Update: 2026-03-04 02:07 GMT

ఇరాన్‌ యుద్ధం గల్ఫ్‌ ప్రాంతం అంతటా వ్యాపించడంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. అయితే కొంతమంది ధనవంతులు భారీ మొత్తాలు చెల్లించి యూరప్‌కు లగ్జరీ చార్టర్‌ విమానాల్లో బయలుదేరుతున్నారు. ఇరాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడుల భయంతో భద్రంగా ఉన్న విమానాశ్రయాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గత వారం చివరలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత దుబాయ్‌, అబుదాబి, ఖతార్‌లోని దోహా ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో చార్టర్‌ విమానాల డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. కొందరు ప్రయాణికులు రెండు లక్షల యూరోలు (సుమారు 2.32 లక్షల డాలర్లు) వరకూ చెల్లిస్తున్నారని సంస్థలు చెబుతున్నాయి.

రోడ్డు మార్గాన కూడా కొందరు...
దుబాయ్‌ సాధారణంగా భద్రత, విలాసవంతమైన సౌకర్యాలకు ప్రసిద్ధి. అలాంటి నగరం నుంచి కూడా చాలామంది రహదారి మార్గం ద్వారా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. దుబాయ్‌ నుంచి సుమారు నాలుగు గంటల దూరంలో ఉన్న ఒమన్‌లోని మస్కట్‌కు లేదా పది గంటలకుపైగా ప్రయాణించాల్సిన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు వెళ్తున్నారు. అక్కడి నుంచి కొద్దిపాటి వాణిజ్య విమానాల్లో సీట్లు దొరికితే ఎక్కుతున్నారు. లేకపోతే చార్టర్‌ విమానాలు బుక్‌ చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైన తర్వాత వీటి ధరలు రెట్టింపు అయ్యాయి.
విమానాల రకాన్ని బట్టి...
ఫ్రాన్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌ జెట్‌ బ్రోకర్‌ జెట్‌–వీఐపీ సీఈఓ ఆల్తాయ్‌ కులా మాట్లాడుతూ, “డిమాండ్‌ భారీగా ఉంది. అవసరానికి సరిపడా విమానాలు అందించడం కష్టంగా మారింది” అని చెప్పారు. సాధారణంగా రియాద్‌ నుంచి పోర్చుగల్‌లోని పోర్టోకు 16 మంది ప్రయాణించే ప్రైవేట్‌ జెట్‌ చార్టర్‌కు సుమారు లక్ష యూరోలు ఖర్చవుతుందని తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తం రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. “విమానాల కొరత, వాటిని ఇతర ప్రాంతాల నుంచి తరలించే ఖర్చు, ఆపరేటర్ల భద్రత అంచనాలు అన్నీ కలిపి ధరలు పెరిగాయి. ఇది ఊహాగాన ధరల పెంపు కాదు” అని కులా వివరించారు. విమానాల రకం, బయలుదేరే స్థలం, మార్గ పరిమితులు వంటి అంశాలపై ధరలు మారుతాయని విమానయాన ప్రైవేట్‌ జెట్స్‌ సీఈఓ అమీర్నరన్‌ తెలిపారు. గల్ఫ్‌ నుంచి యూరప్‌కు చార్టర్‌ విమానాల ధరలు 1.5 లక్షల నుంచి 2 లక్షల యూరోలు వరకు ఉంటున్నాయని చెప్పారు.
వేల డాలర్లలోనే ఖర్చు...
రియాద్‌, మస్కట్‌ వంటి కార్యకలాపాలు కొనసాగుతున్న విమానాశ్రయాలకు చేరేందుకు కొందరు ప్రైవేట్‌ భద్రతా సంస్థలను అద్దెకు తీసుకుంటున్నారు. సాధారణ కార్ల నుంచి బస్సుల వరకూ వాహనాల ద్వారా ప్రయాణాన్ని సమన్వయం చేస్తున్నారు. ఒమాన్‌ సరిహద్దు వద్ద ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో నాలుగు గంటల వరకూ వేచి చూడాల్సి వస్తోందని యూకేకు చెందిన అల్మా రిస్క్‌ సంస్థ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఇయాన్‌ మెక్‌కాల్‌ చెప్పారు. ఖర్చులు వేల డాలర్లలో ఉంటున్నాయని పేర్కొన్నారు. బయటపడేందుకు ప్రయత్నిస్తున్నవారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉన్నారని, స్థానిక నివాసితులు తక్కువమందే ఉన్నారని ఆయన తెలిపారు. తమ సంస్థ గత కొన్ని రోజుల్లో 200 మందికిపైగా బదిలీ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. విమానా సంస్థ ఖాతాదారుల్లో వ్యాపార నిర్వాహకులు, కుటుంబాలు, పారిశ్రామికవేత్తలు, అలాగే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న రిమోట్‌ ఉద్యోగులు ఉన్నారని అమీర్నరన్‌ వివరించారు.
విమానాశ్రయాలు మూసివేతతో...
దుబాయ్‌లో కేంద్రం ఉన్న ఎయిర్‌ చార్టర్‌ సర్వీస్‌ మధ్యప్రాచ్య విభాగం సీఈఓ ఎలీ హన్నా మాట్లాడుతూ, “ఇక్కడి నుంచి బయలుదేరే ఎక్కువ విమానాలు ఒమాన్‌ నుంచే సాగుతున్నాయి. అనేక చార్టర్‌ విమానాలు మూసివేసిన విమానాశ్రయాల్లో నిలిచిపోవడంతో అందుబాటులో విమానాలు తక్కువగా ఉన్నాయి. అందుకే ధరలు పెరిగాయి” అన్నారు. చార్టర్‌ విమానాలు తరచూ ఉపయోగించే వారితో పాటు సాధారణంగా వాణిజ్య విమానాల్లో ప్రయాణించే వారు కూడా ఇతర కుటుంబాలతో కలిసి ఖర్చు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. “అందరూ ఆందోళనలో ఉన్నారు. మస్కట్‌ విమానాశ్రయం విమానాలతో నిండిపోయింది. ఒత్తిడి పరిస్థితి ఉంది” అని హన్నా చెప్పారు. అంతర్జాతీయ భద్రత, ఆరోగ్య సేవల సంస్థ ఇంటర్నేషనల్‌ ఎస్ఓఎస్‌ నిపుణులు ఈ యుద్ధ ప్రభావం రవాణా, ఇంధన మౌలిక వసతులపై ఇంకా కొన్ని వారాల పాటు కొనసాగవచ్చని అంచనా వేశారు.


Tags:    

Similar News