డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగిన అమెరికా

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా బయటకు వచ్చింది.

Update: 2026-01-23 07:35 GMT

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా బయటకు వచ్చింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని గత ఏడాది నుంచే హెచ్చరికలు వస్తున్నాయి. అయితే, కోవిడ్‌ మహమ్మారి నిర్వహణలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ విఫలమైందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. 2025లో తన అధ్యక్ష పదవిలో తొలి రోజే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలుగుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నోటీసు ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు అధికారిక నిష్క్రమణ పూర్తైంది.

కోవిడ్ సమయంలో...
అమెరికా ఆరోగ్య, విదేశాంగ శాఖలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నిష్క్రమణ ప్రక్రియ పూర్తయ్యే వరకు డబ్ల్యూహెచ్‌ఓతో పరిమిత స్థాయిలో మాత్రమే పని చేస్తుంది. “పరిశీలకుడిగా కూడా పాల్గొనే ఆలోచన లేదు. మళ్లీ సంస్థలో చేరే యోచన కూడా లేదు,” అని ఓ సీనియర్ ప్రభుత్వ ఆరోగ్య అధికారి స్పష్టం చేశారు. రోగాల పర్యవేక్షణ, ఇతర ప్రజారోగ్య ప్రాధాన్య అంశాలపై అంతర్జాతీయ సంస్థల ద్వారా కాకుండా, నేరుగా ఇతర దేశాలతో కలిసి పనిచేయాలని అమెరికా నిర్ణయించినట్లు వెల్లడించింది.


Tags:    

Similar News