America : అమెరికాలో భీకర మంచు తుపాను బీభత్సం
అమెరికాలో భీకర మంచు తుపాను బీభత్సం సృష్టిస్తుంది
అమెరికాలో భీకర మంచు తుపాను బీభత్సం సృష్టిస్తుంది. దాదాపు 12 వేల విమానాలు రద్దయినట్లు అధికారుుల ప్రకటించారు. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 14 కోట్ల మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ మంచు, ఐస్‌తో రహదారులు అస్తవ్యస్తం గా మారాయి. విద్యుత్ సరఫరాకు ముప్పు ఏర్పడింది. అమెరికా అంతటా వీకెండ్‌లో ప్రయాణించాల్సిన దాదాపు 12 వేల విమానాలను అధికారులు రద్దు చేశారు. శనివారం దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ప్రమాదకరమైన ఐస్‌తో ప్రధాన రహదారులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
రోజుల తరబడి...
కొన్ని రాష్ట్రాల్లో రోజులు తరబడి విద్యుత్ సరఫరా అంతరాయం కలగవచ్చని అధికారులు హెచ్చరించారు. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 14 కోట్ల మంది, అంటే అమెరికా జనాభాలో 40 శాతం మందికిపైగా శీతాకాల తుపాను హెచ్చరికల పరిధిలో ఉన్నారు. తూర్పు టెక్సాస్ నుంచి నార్త్ కరోలైనా వరకు విస్తరించిన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే అవకాశముందని జాతీయ వాతావరణ సేవ తెలిపింది. ఈ మార్గంలో విపరీతమైన ఐస్ ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ఐస్ తో కూరుకుపోయి...
శనివారం మధ్యాహ్నం నాటికి ఒక్లాహోమా ఆగ్నేయ ప్రాంతాలు, తూర్పు టెక్సాస్, లూసియానాలోని కొన్ని ప్రాంతాల్లో పావు అంగుళం మందం ఐస్ నమోదైంది. డల్లాస్‌కు ఉత్తరంగా ఉన్న ఉపనగరాల్లో రహదారులు మంచుతో కప్పుకుపోయి నిర్మానుష్యంగా కనిపించాయి. ఉత్తర టెక్సాస్‌లో రాత్రి కురిసిన ఐస్, స్లీట్ శనివారం మధ్య టెక్సాస్ వైపు కదిలింది. మిసిసిప్పీలో మూడో వంతు కౌంటీల్లో రహదారులు, వంతెనలపై ఐస్ ఏర్పడింది.ఈ తుపాను ప్రత్యేకత ఏంటంటే, దీని వెంటనే తీవ్రమైన చలి మొదలవుతుందని జాతీయ వాతావరణ సేవ వాతావరణ శాస్త్రవేత్త అలిసన్ సాంటోరెల్లీ చెప్పారు.
ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని...
మంచు, ఐస్ చాలా నెమ్మదిగా కరుగుతాయని, త్వరలో పోయే పరిస్థితి లేదని, దీంతో పునరుద్ధరణ చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు.పదికి పైగా రాష్ట్రాల గవర్నర్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వర్జీనియా గవర్నర్ అబిగెయిల్ స్పాన్‌బర్గర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ తుపాను ఎదుర్కొనేందుకు దుప్పట్లు, వెచ్చదనం, ఆహారం సిద్ధం చేసుకోండి. ఈ సాయంత్రం నుంచి ఆదివారం మొత్తం, సోమవారం ఉదయం వరకూ రహదారులపైకి రావద్దు” అని చెప్పారు.