Iran : ఇరాన్ లో ఉండే ఇండియన్స్ కు వార్నింగ్...వెనక్కు రావాలంటూ?

ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులు వెనక్కు రావాలని ఇప్పటికే భారత్ కోరింది

Update: 2026-01-15 04:27 GMT

ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులు వెనక్కు రావాలని ఇప్పటికే భారత్ కోరింది. భారతీయులు దేశం విడిచిపోవాలని దౌత్య కార్యాలయ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఇరాన్ లో నివసించే భారతీయులు క్షేమంగా తిరిగి రావాలని కోరింది. ఇరాన్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఇరాన్‌లో పెరుగుతున్న అశాంతి నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణ జరిగినట్లు జైశంకర్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ఇరాన్ లోపల, చుట్టుపక్కల చోటుచేసుకుంటున్న పరిణామాలను ఇద్దరూ సమీక్షించామని చెప్పారు.

భారత దౌత్య కార్యాలయ హెచ్చరిక...
ఈ చర్చకు ముందే, టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు సహా ఇరాన్‌లో ఉన్న భారతీయులంతా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా, ముఖ్యంగా వాణిజ్య విమానాల్లో, దేశం విడిచిపోవాలని సూచించింది. ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చగా, మృతుల సంఖ్య 2,500కు చేరిందని సమాచారం. భారతీయులు తమ పాస్‌పోర్టులు, గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలని, అవసరమైన సహాయం కోసం దౌత్య కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక మీడియా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని, భారతీయులు, భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఇరాన్ లో చిక్కుకున్న...
ఇరాన్‌లో చిక్కుకుపోయిన కాశ్మీరీ విద్యార్థులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరింది. అక్కడి భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని తెలిపింది. ఈ అశాంతి ఇరవయ్యో రోజుకు చేరుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడమే నిరసనలకు కారణమని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 280కి పైగా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌లోని నిరసనకారులు తమ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సహాయం వస్తుందని చెప్పినా వివరాలు వెల్లడించలేదు. ఆ మరుసటి రోజు, జాగ్రత్త చర్యగా ఖతర్‌లోని అమెరికా నిర్వహణలో ఉన్న అల్ ఉడైద్ వైమానిక స్థావరం నుంచి కొంతమంది సిబ్బందిని తరలించాలని ట్రంప్ ప్రభుత్వం సూచించింది. ఇరాన్‌పై దాడి జరిగితే అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని, వాటికి ఆతిథ్యం ఇస్తున్న పొరుగుదేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.






Tags:    

Similar News