ట్రంప్ చెంతకు నోబెల్ శాంతి బహుమతి

వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియా కోరినా మచాడో గురువారం అసాధారణ అడుగు వేశారు

Update: 2026-01-16 02:08 GMT

వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియా కోరినా మచాడో గురువారం అసాధారణ అడుగు వేశారు. తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చానని ఆమె ప్రకటించారు. నికోలస్ మదురోను కూలదోసిన తరువాత ట్రంప్ తనను పక్కనపెట్టారని భావించిన మచాడో, అధ్యక్షుడి మద్దతు సాధించేందుకు ఈ ప్రయత్నం చేశారు.వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భోజనం చేసిన అనంతరం, యూఎస్‌ క్యాపిటల్‌ వెలుపల విలేకరులతో మాట్లాడిన మచాడో, అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి పతకం సమర్పించానని తెలిపారు. తమ స్వేచ్ఛ పట్ల ఆయన చూపిన ప్రత్యేక నిబద్ధతకు ఇది గుర్తింపు అని మచాడోచెప్పారు.

నిబంధనల మేరకు...
మచాడో వయస్సు 58 ఏళ్లు. అయితే భేటీ తర్వాత ట్రంప్ పతకాన్ని స్వీకరించారా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం బహుమతులు బదిలీ చేయలేరు. జనవరి 3న మదురోను పట్టుకునేందుకు అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ తర్వాత ట్రంప్ మచాడోకు మద్దతు ఇవ్వలేదు. బదులుగా వెనిజువేలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌కు ఆయన అండగా నిలిచారు. ముఖ్యంగా దేశంలోని భారీ చమురు వనరులపై వాషింగ్టన్‌ గీత దాటకుండా వ్యవహరించేంత వరకూ ఆమెకు మద్దతు కొనసాగుతుందని ట్రంప్ వర్గాలు సూచించాయి. గత ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి తనకు రావాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మదురో న్యూయార్క్ జైలులోనే...
తాను ఎనిమిది యుద్ధాలు ఆపేందుకు ప్రయత్నించానని ఆయన ప్రచారం చేశారు. చివరకు ఆ బహుమతి మచాడోకే దక్కింది. గత నెల ఒస్లోలో పతకం స్వీకరించిన ఆమె, పడవలో వెనిజువేలా నుంచి తప్పించుకుని అక్కడికి చేరారు. ఆ సందర్భంలోనూ ట్రంప్‌కే అంకితం చేస్తున్నట్లు చెప్పారు.2024 ఎన్నికల్లో మదురో తమ పార్టీ అభ్యర్థి ఎడ్ముండో గోన్సాలెజ్‌ ఉర్రుటియాపై విజయం దోచుకున్నారని ప్రతిపక్షం ఆధారాలతో సహా వాదిస్తోంది. ఈ ఆరోపణలకు వాషింగ్టన్‌ మద్దతు తెలిపింది. అయితే మచాడోకు దేశంలో తగిన ప్రజా మద్దతు లేదని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ రోడ్రిగ్స్‌కే మొగ్గు చూపారు. గురువారం అమెరికా బలగాలు ఆరో చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో సుమారు 500 మిలియన్‌ డాలర్ల విలువైన వెనిజువేలా చమురు తొలి అమెరికా మధ్యవర్తిత్వ విక్రయం ఖరారైనట్లు యూఎస్‌ అధికారి తెలిపారు.మదురో ప్రస్తుతం న్యూయార్క్‌ జైలులో మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్నారు.


Tags:    

Similar News