చివరి దశకు భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం
భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరింది.
భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. రెండు దేశాలు సిద్ధమైన వెంటనే ఒప్పందాన్ని ప్రకటిస్తామని చెప్పారు. చర్చలకు గడువు అనేది చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరు దేశాల చర్చా బృందాలు పెండింగ్‌లో ఉన్న దాదాపు అన్ని అంశాలపై వర్చువల్‌గా చర్చలు కొనసాగిస్తున్నాయని అగర్వాల్ చెప్పారు. ఒప్పందం చాలా దగ్గరలోనే ఉందని, అయితే ఇరు పక్షాలు సిద్ధమైనప్పుడే, సరైన సమయమని భావించినప్పుడే సరైన ప్రకటన వస్తుందని ఆయన మీడియాతో చెప్పారు.
ఎప్పుడూ నిలిచిపోలేదని...
భారత్–అమెరికా మధ్య చర్చలు ఎప్పుడూ నిలిచిపోలేదని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలు నిరంతరం సంప్రదింపుల్లోనే ఉన్నాయని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో ఉప యూఎస్టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్ పర్యటన తర్వాత ఈ సమావేశం జరిగింది. జనవరి 12న తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్, వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరు దేశాలు చురుకుగా పనిచేస్తున్నాయని చెప్పారు.
నిజమైన మిత్రులుగా...
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రయోజనాలకే పరిమితం కావని, అత్యున్నత స్థాయిలో బలమైన అనుబంధం ఉందన్నారు.నిజమైన మిత్రులు విభేదించినా, చివరకు పరిష్కారం కనుగొంటారని గోర్ వ్యాఖ్యానించారు.ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం వరకు ఉన్న భారీ సుంకాలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒత్తిడి తెచ్చాయని అధికారులు పేర్కొన్నారు. అదనపు దిగుమతి సుంకాల అంశంతో పాటు, గత ఏడాది మేలో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ముగిసిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, వాషింగ్టన్ కొత్త వలస విధానం వంటి అంశాలపై కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సానుకూల వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు.