అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధం ముగిసే ఒప్పందం త్వరలో కుదరకపోతే, ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, తాగునీరు సరఫరా చేసే ఉప్పునీరు శుద్ధి కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగించింది. కువైట్‌లోని ఒక కీలక విద్యుత్, నీటి శుద్ధి కేంద్రాన్ని దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని ఒక చమురు శుద్ధి కేంద్రం లక్ష్యంగా దాడి జరిగింది. దుబాయ్ సముద్ర జలాల్లో కువైట్‌కు చెందిన చమురు ట్యాంకర్‌ను డ్రోన్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంగళవారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు దుబాయ్ మీడియా కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మరో దాడులను ప్రారంభించాయి. యుద్ధం ఎటువంటి ముగింపు సంకేతాలు లేకుండా కొనసాగుతోంది.
ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటామని...
ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక సోషల్ మీడియా పోస్టులో వచ్చింది. అంతకుముందు ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన వ్యాఖ్యల్లో ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ దీవిని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు. తాము దౌత్యపరంగా పురోగతి సాధిస్తున్నామని ట్రంప్ చెబుతున్నా, టెహ్రాన్ మాత్రం ప్రత్యక్ష చర్చలు లేవని ఖండిస్తోంది. ఇదే సమయంలో అమెరికా వేలాది సైనికులను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్‌తో చర్చలు సాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే పాకిస్థాన్ ద్వారా జరుగుతున్న చర్చలు అమెరికా సైనిక మోహరింపుకు కేవలం నెపమేనని ఖలీబాఫ్ వ్యాఖ్యానించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత...
ఇరాన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఒప్పందం త్వరగా కుదరకపోతే, హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, ఖార్గ్ దీవి, అవసరమైతే ఉప్పునీరు శుద్ధి కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ జలసంధి ద్వారా సాగుతుంది. యుద్ధ చట్టాల ప్రకారం పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయాలంటే సైనిక ప్రయోజనం పౌర నష్టాన్ని మించాలి అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పౌరులకు అధిక నష్టం కలిగితే అది యుద్ధ నేరంగా పరిగణించే అవకాశం ఉందని అంటున్నారు.టెహ్రాన్ సమీపంలోని కరాజ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు దాడుల తర్వాత గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపాడు. “విద్యుత్ కేంద్రాలనే కొట్టారేమో, ఇక కరెంటు ఉండదేమో అనిపించి చాలా భయపడ్డాను” అని ఆయన చెప్పారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒత్తిడి...
ఖార్గ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై ఇప్పటికే అమెరికా దాడులు జరిపింది. అమెరికా సైన్యం తమ భూభాగంలో అడుగుపెడితే గల్ఫ్ అరబ్ దేశాలపై భూసైన్య దాడులు చేస్తామని, పర్షియన్ గల్ఫ్‌లో మైన్లు వేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయ్, ట్రంప్ ప్రభుత్వం పంపిన 15 అంశాల ప్రతిపాదనలో “అతిగా, అసాధ్యంగా, అసంబద్ధంగా ఉన్న డిమాండ్లు ఉన్నాయి” అని చెప్పారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌లోని ప్రధాన అణు పరిశోధన కేంద్రం సమీపంలో అలారంలు మోగాయి. యెమెన్ నుంచి ప్రయాణించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సౌదీ అరేబియాలో ఐదు క్షిపణులను అడ్డుకున్నారు. దుబాయ్ ఆకాశంలో ఒక క్షిపణిని అడ్డుకోవడంతో అగ్నిగోళం కనిపించింది. కువైట్‌లోని విద్యుత్, నీటి శుద్ధి కేంద్రంపై దాడిలో ఒక కార్మికుడు మరణించగా, 10 మంది సైనికులు గాయపడ్డారని కువైట్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
లెబనాన్‌లో శాంతి సైనికుల మృతి...
లెబనాన్ దక్షిణంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న ప్రాంతంలో 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి సైనికులు మరణించారు. ఫ్రాన్స్ విజ్ఞప్తితో భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వీరు ఇండోనేషియా సైనికులు అని ఐరాస అధికారులు తెలిపారు. ఒక వాహనం పేలుడుతో ఇద్దరు, యునిఫిల్ స్థావరంపై దాడిలో మరొకరు మృతి చెందినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ఈ ఘటనలపై సమీక్ష జరుపుతోంది. ఇదే సమయంలో బీరుట్ పరిసర ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో ఒకరు మృతి చెందగా, నలుగురు చిన్నారులు సహా 17 మంది గాయపడ్డారు. ఇరాన్‌లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌లో 19 మంది, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్‌లో 24 మంది, లెబనాన్‌లో 1,200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. లక్ష మందికి పైగా ప్రజలు ఇళ్లను విడిచి వెళ్లారు.
చమురు ధరలు మళ్లీ పెరుగుదల...
ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో ప్రపంచ చమురు, వాయువు, ఎరువుల సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. ఇంధన ధరలు అమాంతం ఎగిశాయి.హోర్ముజ్ జలసంధి ద్వారా సోమవారం నుంచి 20 చమురు ట్యాంకర్లకు అనుమతి ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు. అయితే అవి నిజంగా ప్రయాణం ప్రారంభించాయా అనే వివరాలు లేవు.అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం సుమారు 115 డాలర్ల వద్ద నమోదైంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 60 శాతం పెరిగింది.