Sri Lanka: ప్రధాని మహింద రాజపక్స రాజీనామా, సంక్షోభానికి తలొంచిన అగ్రనేత

శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని.. హింసతో సాధించేదేమీ ఉండదని ఆయన కోరారు.

Update: 2022-05-09 11:59 GMT

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం దిగిపోవాలంటూ ఆందోళనలు చేస్తుండడంతో కొద్దిరోజులుగా ద్వీపం అట్టుడికిపోతోంది. భారీగా పెరిగిన నిత్యవసరాల ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లతో ప్రభుత్వంపై ప్రజలు దండెత్తారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సోమవారం రాజీనామా చేయనున్నట్లు ముందుగానే ఊహాగానాలు మొదలయ్యాయి.

అనుకున్నట్టుగానే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని రాజీనామాతో క్యాబినెట్ కూడా రద్దు కానుంది. కుటుంబ పాలన కారణంగానే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు, ప్రధానితో సహా ఆర్థిక మంత్రి కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. భారీ అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే సంక్షోభం నెలకొందని ప్రజలు తిరగబడే పరిస్థితులు దాపురించాయి.

మహింద రాజపక్స తొలిసారి 2005లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటికే పాతికేళ్లుగా ఆ దేశంలో తమిళులు, సింహళీయుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఎల్టీటీఈ బలంగా ఉన్న రోజుల్లో మహింద రాజపక్స బాధ్యతలు చేపట్టారు. ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుని ఎల్టీటీఈపై సైనిక చర్యకు ఉపక్రమించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎట్టకేలకు ఎల్టీటీఈని తెరమరుగు చేసి బలమైన నేతగా ఎదిగారు. 2005 నుంచి 2015 వరకూ ఆయన శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. అంతర్యుద్ధాన్ని జయించిన అగ్ర నేత.. ఆర్థిక సంక్షోభానికి తలొగ్గక తప్పలేదు. ప్రస్తుతం ఆయన సోదరుగు గొటాబయ రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News