లీటరు పెట్రోల్ ధర రూ.420.. ఎక్కడో తెలుసా ?

సిలోన్ తో పాటు.. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది.

Update: 2022-05-24 09:14 GMT

శ్రీలంక : రెండు నెలలకు పైగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత రెట్టింపయ్యాయి. తాజాగా పెరిగిన ధరలతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.420కి చేరింది. ఈ మేరకు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారిక ప్రకటన చేసింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం పెరగ్గా.. డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది. అంటే పెట్రోల్ ధర లీటరుకు రూ.82, లీటర్ డీజిల్ ధర రూ.111 పెరిగి రూ.400కి చేరింది.

సిలోన్ తో పాటు.. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ఈ భారం రవాణా ఖర్చులపై.. ఆ తర్వాత వినియోగదారులపై పరోక్షంగా పడి.. నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అక్కడ ఆటో డ్రైవర్లు ఇప్పటికే కిలోమీటరుకు రూ.90 వరకూ వసూలు చేస్తున్నారు.
శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. తినడానికి తిండి లేక.. ఉన్న డబ్బుతో నిత్యావసర వస్తువులు కొనలేక కొన్ని లక్షల మంది పస్తులుంటున్నారు. శ్రీలంక ప్రభుత్వం చేసిన అప్పులే లంకకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఆర్థిక, ఆహార సమస్యలతో పాటు తీవ్రమైన విద్యుత్ కొరత కూడా శ్రీలంక ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది.



Tags:    

Similar News