ఇలాగే వ్యవహరిస్తే భారత్‌కు గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని బెదిరింపులు
పాకిస్థాన్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోనివ్వబోమని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్‌ను బహిరంగంగా బెదిరించారు.
పాకిస్థాన్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోనివ్వబోమని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్‌ను బహిరంగంగా బెదిరించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో షాబాజ్ మాట్లాడుతూ.."నేను శత్రువుకు చెప్పాలనుకుంటున్నాను.. మీరు మా నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే.. గుర్తుంచుకోండి..! మీరు ఒక్క చుక్క కూడా తీసుకోలేరు" అని షాబాజ్ అన్నారు.
ఏప్రిల్ 23న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మరణించగా.. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. నీటి ప్రవాహాన్ని ఆపడం యుద్ధంతో సమానమని పాకిస్థాన్ పదే పదే హెచ్చరిస్తోంది.. భారత్ ఇలాగే వ్యవహరిస్తే పశ్చాత్తాపం చెందాల్సిన గుణపాఠం చెబుతామని షాబాజ్ అన్నారు.
షెహబాజ్ షరీఫ్ ప్రకటనకు ముందు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా సింధు జలాల విషయమై రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని సింధు లోయ నాగరికతపై జరిగిన దాడిగా అభివర్ణించిన బిలావల్.. భారత్ యుద్ధం చేయలనుకుంటే.. పాకిస్థాన్ వెనక్కి తగ్గదని అన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కూడా భారత్‌ను బెదిరించారు. "భారతదేశం ఆనకట్టలు నిర్మించే వరకు మేము వేచి ఉంటాము.. అవి పూర్తవగానే మేము వాటిని నాశనం చేస్తాము" అని వ్యాఖ్యానించాడు. సింధూ నది భారతదేశ ఆస్తి కాదు.. భారత్ దుర్మార్గపు కుట్రలను భగ్నం చేయడానికి మాకు వనరుల కొరత లేదని హెచ్చరించాడు. మునీర్ ప్రకటనకు భారత విదేశాంగ శాఖ సోమవారం కాస్త గట్టిగానే బదులిచ్చింది. భారత్ తన జాతీయ భద్రత కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని, ఎలాంటి అణు ముప్పుకు తలొగ్గదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.