Cease Fire : తీరు మార్చుకోని పాక్.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన దాయాది దేశం
భారత్ - పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటల్లోనే దానిని ఉల్లంఘించి పాక్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది
భారత్ - పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటల్లోనే దానిని ఉల్లంఘించి పాక్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. అంతర్జాతీయ సమాజం ముందు కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పిన పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. దీంతో సరిహద్దుల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా రాయబారంతో భారత్ - పాక్ లు కాల్పులను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచే కాల్పుల విరమణ అమలులో వస్తుందని ఇటు భారత్, అటు పాక్ రెండు దేశాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ల మధ్య చర్చలు సఫలం కావడంతో ఉద్రిక్తతలు ముగిసిందని అందరూ భావించారు.
సరిహద్దు రాష్ట్రాలపై...
కానీ రాత్రికి మళ్లీ పాక్ సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లతో తెగపడింది. అయితే భారత్ సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కుదిరిన ఒప్పందం మేరకు భూ ఊపరితలం, గగనతలం, సాగరజాలాల్లో ఎలాంటి కాల్పులు జరపడానికి ఇరు దేశాలు ప్రయత్నించకూడదు. అయితే ఆరు గంటలకు ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించింది. శ్రీనగర్ లోనూ పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. పింజార్, అఖ్నూర్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది.
అనేక చోట్ల బ్లాక్ అవుట్ లు...
శ్రీనగర్ లో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమరు అబ్దుల్లా తెలిపారు. పాక్ దుశ్చర్యకు దిగిందని తెలిపారు. దీంతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని తెలిపారు. పాక్ దాడులకు భారత్ ధీటైన జవాబు ఇస్తున్నప్పటికీ ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పి మరొక వైపు దానిని ఉల్లంఘించి పౌర ప్రాంతాలపైదాడులకు దిగడాన్ని సీరియస్ గా భారత్ తీసుకుంది. సరిహద్దురాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో తిరిగి బ్లాక్ అవుట్ ను భద్రతాదళాలు విధించాయి. గుజరాత్ లోనూ రాత్రి లైట్లను ఆర్పి వేయాలని ఆదేశించారు. గుజరాత్ లోని కచ్లోనూ పాక్ డ్రోన్లు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించడం కూడా జరిగింది. పాక్ విదేశాంగ మాత్రం తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించ లేదని చెబుతూ మరొకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తేలా వ్యవహరించింది. రేపు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న సమయంలో పాక్ ఇలా వ్యవహరించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది.