Israel - Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రం.. ఇంకా ఎన్నాళ్లు?
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది గల్ఫ్‌లో చమురు, వాయువు సదుపాయాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో చమురు, సహజ వాయువు కేంద్రాలపై దాడులు పెంచిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. కీలక గ్యాస్ ఫీల్డ్‌పై ఇకపై దాడులు చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. శుక్రవారం కూడా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కొనసాగించింది. హైఫా నుంచి గలిలీ వరకు, లెబనాన్ సరిహద్దు వరకు అలారంలు మోగాయి. లక్షల మంది ప్రజలు బంకర్లకు పరుగులు తీశారు. గురువారం ఒక్కరోజే డజన్‌కు పైగా దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
హోర్ముజ్ జలసంధిపై ఒత్తిడి...
దీనికి ప్రతిగా శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ తేహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఇదే సమయంలో ఇరాన్ ప్రజలు నౌరూజ్ పండుగ జరుపుకుంటున్నారు.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం వల్ల ఇప్పటికే ఇంధన సరఫరా ఒత్తిడిలో ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది.దక్షిణ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ చేసిన దాడులు ఇంధన ధరలను మరింత పెంచాయి. దీంతో గల్ఫ్ దేశాలు కూడా నేరుగా ఈ ఘర్షణలోకి లాగబడే ప్రమాదం పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఆ గ్యాస్ ఫీల్డ్‌పై ఇక దాడులు చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు.
ఇరాన్ సామర్థ్యంపై నెతన్యాహూ...
ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ అగ్రనాయకులు మరణించారని, సైనిక శక్తి బలహీనపడిందని నెతన్యాహూ చెప్పారు. ఇరాన్‌కు యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయితే దీనికి ఆధారాలు చూపలేదు. అయినా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే స్థాయిలో ఉందని స్పష్టం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో ఓ నౌకకు మంటలు అంటుకున్నాయి. ఖతార్ సమీపంలో మరో నౌక దెబ్బతింది. హోర్ముజ్ మార్గాన్ని తప్పించుకునే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. రెడ్ సీలో సౌదీ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు పైగా చేరింది. యుద్ధం ప్రారంభం నుంచి 60 శాతం పెరిగింది. సహజ వాయువు ధరలు కూడా భారీగా పెరిగాయి.
యూఎన్ భద్రతా మండలిలోనూ. చర్చ...
ఇరాన్ దాడులపై యూఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని అవి ఇరాన్‌ను కోరాయి. అయినా ఇరాన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడంలేదు. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఎల్.ఎన్.జి కేంద్రంపై దాడి వల్ల ఎగుమతులు 17 శాతం తగ్గాయి. ఏడాదికి 20 బిలియన్ డాలర్ల నష్టం ఉంటుందని అంచనా. మరమ్మతులకు ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది. కువైట్, అబుదాబిలోని చమురు, వాయువు కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులతో 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అక్కడ వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో 15 మంది చనిపోయారు. వెస్ట్ బ్యాంక్‌లో మరో నలుగురు మృతి చెందారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.