Iran - Israel War : హోర్ముజ్ జలసంధిపై తీవ్ర ఒత్తిడి.. ప్రపంచ ఆయిల్ సరఫరాపై ఆందోళన

గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది

Update: 2026-03-19 13:31 GMT

గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధానికి ఇది మరింత తీవ్రత తీసుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ కీలక వాయువు క్షేత్రంపై దాడి చేసిన తర్వాత ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టింది. దీంతో ఇంధన ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి గల్ఫ్ దేశాలు కూడా నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందన్న ఆందోళన పెరిగింది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ఉండటం వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రపంచ చమురు సరఫరా మరింత ఇబ్బందుల్లో పడింది.

యూఏఈ తీరంలో...
యూఏఈ తీరంలో ఓ నౌకకు మంటలు అంటుకున్నాయి. ఖతర్ సమీపంలో మరో నౌక దెబ్బతినింది. హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా భద్రంగా లేవని స్పష్టమైంది. ఎర్ర సముద్రం వద్ద సౌదీ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 118 డాలర్ల వరకు చేరింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దాడులు మొదలైన తర్వాత ఇది 60 శాతానికి పైగా పెరిగింది. ఇంధన ధరల ప్రభావంతో జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశానికి ముందే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పరిస్థితిని తీవ్రంగా అభివర్ణించారు. యుద్ధ విరమణ, చర్చలు అవసరమని కోరారు.
గల్ఫ్ దేశాల్లో దాడులు...
ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఇరాన్ చర్యలను ఖండించాయి. అరబ్ లీగ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ అబౌల్ ఘైట్ దీనిని ప్రమాదకర ఉద్రిక్తతగా పేర్కొన్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్, తూర్పు ప్రాంతాల్లో ఆరు డ్రోన్లను అడ్డుకుంది. యన్‌బూ పోర్టులోని సామ్‌రెఫ్ రిఫైనరీపై దాడి జరిగినట్లు తెలిపింది. హోర్ముజ్ మార్గాన్ని తప్పించేందుకు సౌదీ ఇప్పటికే ఎర్ర సముద్రం వైపు చమురు తరలిస్తోంది. ఖతర్‌లోని రాస్ లాఫాన్ ఎల్‌ఎన్‌జీ కేంద్రంపై క్షిపణులు పడటంతో భారీ నష్టం వాటిల్లింది. అక్కడ మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. ముందస్తు దాడుల వల్ల ఉత్పత్తి ఇప్పటికే ఆగిపోయింది. ఇది ప్రపంచానికి వాయువు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
గ్యాస్ నిక్షేపాలపై దాడులతో...
కువైట్‌లోని మీనా అల్-అహ్మది రిఫైనరీలో డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలోని మీనా అబ్దుల్లా కేంద్రంలో కూడా మంటలు చెలరేగాయి. అబుదాబిలోని హబ్‌షాన్ గ్యాస్ కేంద్రం, బాబ్ ఫీల్డ్ కార్యకలాపాలు నిలిపివేశారు. ఇరాన్ దాడులు ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నా ప్రాణనష్టం పెద్దగా లేదు. ప్రపంచంలో అతిపెద్ద వాయువు క్షేత్రంగా గుర్తింపు పొందిన సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్, ఖతర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. ఇరాన్‌లో విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం సహజ వాయువుపైనే ఆధారపడుతోంది. దీంతో ఈ దాడి దేశ విద్యుత్ సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ దాడితో మరింత తీవ్రతరం...

ఈ దాడితో యుద్ధం మరింత విస్తరించినట్లు పరిశోధనా సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల జీవన పరిస్థితులను కష్టతరం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ లక్ష్యాలను ఎంచుకుంటోందని విశ్లేషించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడులు నియంత్రణ తప్పితే ప్రపంచానికే ముప్పు ఉంటుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఖతర్ శక్తి కేంద్రాలపై దాడులు కొనసాగిస్తే అమెరికా కూడా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.

ప్రదర్శనల్లో అరెస్టయిన ముగ్గురికి ఉరి

జనవరిలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టైన ముగ్గురిని ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. కోమ్ నగరంలో ఇద్దరు పోలీసులను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆందోళనలను అణచివేసే సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణల్లో న్యాయం జరగడం లేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడో వారంలోకి ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం చేరింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,300 మందికిపైగా మరణించారు. లెబనాన్‌లో హిజ్బుల్లా దాడుల కారణంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు నివాసాలు విడిచారు. 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో 15 మంది మృతిచెందారు. వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News