Iran - Israel War : గ్యాస్ క్షేత్రాలే లక్ష్యం… గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం పందొమ్మిదో రోజుకు చేరుకుంది

Update: 2026-03-19 02:03 GMT

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం పందొమ్మిదో రోజుకు చేరుకుంది. యుద్ధం మరింత ఉధృతమైంది. ఇరాన్ కీలక నాయకత్వంపై దాడులు కొనసాగిస్తూ, ఆ దేశ గూఢచారి శాఖ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. అదే సమయంలో ఇరాన్ దక్షిణ పార్స్ సముద్ర గ్యాస్ క్షేత్రంపై కూడా దాడి చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఈ దాడిని ఖండించారు. “ఇది నియంత్రణ తప్పే పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు...
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు పెంచింది. కతార్‌లో గ్యాస్ సౌకర్యాలపై మిసైల్ దాడులు చేసింది. రాస్ లాఫాన్ ఎల్‌ఎన్‌జీ కేంద్రంపై దాడి జరగడంతో భారీ నష్టం సంభవించింది. దీనికి స్పందనగా కతార్ ప్రభుత్వం ఇరాన్ రాయబారి కార్యాలయ సిబ్బందిని 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. యూఏఈలోని హబ్షాన్ గ్యాస్ కేంద్రం, బాబ్ ఆయిల్ ఫీల్డ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులను యూఏఈ ప్రభుత్వం “ప్రమాదకర స్థాయి పెరుగుదల”గా పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్, కువైట్, బహ్రెయిన్‌పైనా దాడులు జరిగాయి.
చమురు ధరల ఎగిసిపాటు...
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒత్తిడి పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 5% పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లను దాటాయి. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 50శాతం పెరిగాయి. అమెరికా చమురు సరఫరాలు పెంచే ప్రయత్నాల్లో భాగంగా వెనిజులాపై కొన్ని ఆంక్షలు సడలించింది. అక్కడి ప్రభుత్వ చమురు సంస్థతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇరాన్ నేతలపై వరస దాడులు...
ఇరాన్ గూఢచారి మంత్రి ఖతీబ్ హత్య తర్వాత “ఇంకా పెద్ద సర్‌ప్రైజ్‌లు ఉంటాయి” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చెప్పారు. అంతకుముందు అగ్ర భద్రతాధికారి అలీ లారిజానీ, బసిజ్ దళాల అధిపతి గోలం రెజా సోలేమాని కూడా హతమయ్యారు.దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్ దాడులు చేసింది. వెస్ట్ బ్యాంక్‌లో మిసైల్ పడటంతో అక్కడ మొదటి మరణాలు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ఇజ్రాయెల్‌పై ఇరాన్ బహుళ వార్‌హెడ్ మిసైళ్లను ప్రయోగించింది. ఇవి రక్షణ వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఇరాన్ తెలిపింది. కొన్ని మిసైళ్లు గాల్లోనే విభజించి లక్ష్యాలను దాడి చేసినట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
ఇరాన్‌లో దాడులు, మరణాలు
దక్షిణ ఇరాన్‌లోని లారెస్టాన్ కోర్టు సముదాయంపై వైమానిక దాడి జరిగింది. కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్‌లో 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశాడన్న ఆరోపణలతో ఒకరిని ఇరాన్ ఉరి వేసింది.హిజ్బుల్లాపై ఒత్తిడి కొనసాగిస్తూ బీరూట్‌లోని అపార్ట్‌మెంట్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. కనీసం డజను మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నప్పటికీ, దాడిలో పాల్గొనలేదని సమాచారం. ఈ విషయంలో అమెరికా అధికారికంగా స్పందించలేదు.


Tags:    

Similar News