Israel Hamas ceasefire : రెండేళ్ల యుద్ధానికి తెర... ఇజ్రాయిల్ - హమాస్ మధ్య యుద్ధవిరమణ ఒప్పందం

రెండేళ్ల యుద్ధానికి తెరపడనుంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది

Update: 2025-10-09 02:15 GMT

రెండేళ్ల యుద్ధానికి తెరపడనుంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు బందీల విడుదలకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళనుంది. గాజాలో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన ఈ ఒప్పందం ప్రకారం బందీలతోపాటు కొందరు ఖైదీలను విడుదల చేయనున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ విధ్వంసక యుద్ధంలో ఈ ఒప్పందం పెద్ద మలుపుగా భావిస్తున్నారు. దీనివల్ల రెండు దేశాల్లో శాంతి నెలకొనడమే కాకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి దోహదపడుతుంది.

ఇద్దరి మధ్య...
బందీలను త్వరలోనే విడుదల చేస్తారని, ఇజ్రాయెల్‌ సైన్యం అంగీకరించినంత వరకూ వరకు వెనక్కి వెళ్తుందని, ఈ ఒప్పందం ద్వారా బలమైన, శాశ్వతమైన శాంతి దిశగా మొదటి అడుగులు పడతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ సమాన న్యాయం జరుగుతుందని కూడా డొనాల్డ్ చెప్పారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ కూడా దేవుని దయతో అన్ని బందీలను ఇంటికి తీసుకొస్తాంమని సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు. మరోవైపు హమాస్‌ నాయకులు కూడా ఈ ఒప్పందంతో గాజాలో యుద్ధం ముగుస్తుందని, ఇజ్రాయెల్‌ సైన్యం వెనక్కి వెళ్తుందని, గాజాకు సహాయం చేరుతుందని, బందీలు–ఖైదీల మార్పిడి జరుగుతుందని ప్రకటించారు.
ఒప్పందంలోని ప్రతి అంశాన్ని...
ఇజ్రాయెల్‌ ఒప్పందంలోని ప్రతీ అంశాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలంటూ హమాస్‌ విజ్ఞప్తి చేసింది. అమెరికా మీడియా నివేదికల ప్రకారం హమాస్‌ ఈ వారాంతంలో 20మంది బందీలను విడుదల హమాస్ చేయనుంది. అదే సమయంలో ఇజ్రాయెల్‌ సైన్యం గాజా ఎక్కువభాగం నుంచి వెనక్కి వెళ్ళడం ప్రారంభిస్తుంది. గత కొన్ని నెలలుగా స్థబ్దంగా ఉన్న శాంతి ప్రయత్నాలకు ఈ ఒప్పందం కొత్త ఊపునిచ్చినట్లు అంతర్జాతీయ సమాజంలో ఇన్నాళ్లు యుద్ధాన్ని గమనించిన విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్యాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో విస్తృతంగా విధ్వంసం జరిగింది. మధ్యప్రాచ్యంలో మరిన్ని ఘర్షణలకు ఇది దారి తీసింది. ఈ ఒప్పందంతో తెరపడి శాంతి నెలకొనే అవకాశముంది.


Tags:    

Similar News