Iran : ఇరాన్ లో కొనసాగుతున్న ఆందోళనలు...వీధుల్లో పోటెత్తిన జనం

ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Update: 2026-01-12 03:07 GMT

ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న అల్లర్లలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. మరొకవైపు నిరసనకారుల తరఫున అమెరికా జోక్యం చేసుకుంటే తమ సైనిక స్థావరాలపై దాడి చేస్తామని టెహ్రాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. 2022 తర్వాత దేశంలోనే అతిపెద్ద నిరసనలు ఎదుర్కొంటున్న ఇరాన్ పాలక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. నిరసనకారులపై బలప్రయోగం చేస్తే జోక్యం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.

పదివేల మందికిపైగా అరెస్ట్ లు...
నిరసనకారులు వందల సంఖ్యలో మరణించారని, భద్రతా సిబ్బంది 48 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిరసనలు చేస్తున్న వారిని 10,600మందికి పైగా అరెస్టు చేశారు. మరొకవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖాలిబాఫ్ ఆదివారం పార్లమెంటులో మాట్లాడుతూ అమెరికాను హెచ్చరించారు.ఇరాన్‌పై దాడి జరిగితే ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు మా లక్ష్యాలే” అని ఆయన స్పష్టం చేశారు. ఖాలిబాఫ్ గతంలో ఇరాన్ విప్లవ గార్డ్స్‌లో కీలక పదవుల్లో పనిచేశారు.
నిరసనల నేపథ్యం ఇదీ...
డిసెంబర్ 28న ధరల పెరుగుదలపై మొదలైన నిరసనలు క్రమంగా మతపరమైన పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా మారాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అధికారంలో ఉన్న మౌలవీల పాలనపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తింది. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రల వల్లే అల్లర్లు చెలరేగాయని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. “అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం” అని పోలీసు చీఫ్ అహ్మద్-రెజా రాదాన్ చెప్పారు. గురువారం నుంచి ఇంటర్నెట్ నిలిపివేయడంతో సమాచార ప్రవాహం తీవ్రంగా తగ్గింది. టెహ్రాన్‌లో వేలాది మంది వీధుల్లో నడుచుకుంటూ నినాదాలు చేశారు.అమెరికా జోక్యం జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ హై అలర్ట్‌లో ఉందని భద్రతా వర్గాలు వెల్లడించారు.


Tags:    

Similar News