Iran : ఇరాన్‌లో నిరసన ఆపడానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి
ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఇరాన్ లో నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిరసనలు అణిచివేస్తున్నప్పటికీ,వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఆందోళనలు ఆగలేదు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య హింస మరింత పెరగనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న తొలి వ్యక్తికి బుధవారం ఉరి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ కథనానికి మానవ హక్కుల సంస్థలను ఉదహరణగా పేర్కొంది.
హ్యూమన్ రైట్స్ కూడా...
ఇరాన్ హ్యూమన్ రైట్స్ , నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం, 26 ఏళ్ల ఎర్ఫాన్ సోల్తానీకి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. గత వారం గురువారం కరాజ్‌లో జరిగిన నిరసనల్లో అతడిని అరెస్ట్ చేశారు. అందుతున్న వివరాల ప్రకారం... “ఇరాన్‌కు స్వేచ్ఛ కావాలని పిలవడమే అతడి ఒక్కటే నేరం.” సోల్తానీ ఉరి శిక్షను ఆపేందుకు అంతర్జాతీయంగా మద్దతు ఇవ్వాలని ఎన్.యూ.ఎఫ్.డి పిలుపునిచ్చింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, అతడికి న్యాయవాది సహాయం కూడా కల్పించలేదు. అతడిపై ‘దేవుడిపై యుద్ధం ప్రకటించడం’ అనే అభియోగం మోపారు. ఇరాన్ చట్టాల ప్రకారం ఈ నేరానికి ఉరి శిక్ష ఉంది.
వేలాది మంది మృతి...
హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, నిరసనల 17వ రోజు ముగిసే సరికి దేశవ్యాప్తంగా 614 నిరసన కార్యక్రమాలు నమోదయ్యాయి. ఇవి దేశంలోని 31 ప్రావిన్సుల్లోని 187 నగరాల్లో జరిగాయి. ఇప్పటివరకు 18,434 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.నిరసనల్లో 2,403 మంది మరణించినట్లు సంస్థ తెలిపింది. వీరిలో 18 ఏళ్ల లోపు 12 మంది పిల్లలు ఉన్నారు. భద్రతా బలగాలు, ప్రభుత్వ మద్దతుదారుల్లో 147 మంది మృతి చెందారు. వీరిలో కనీసం ఐదుగురు పౌర ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించింది.. నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, నిర్వాసిత క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి మంగళవారం నిరసనకారులు, సాయుధ బలగాలకు పిలుపునిచ్చారు. ప్రపంచం నిరసనకారుల ధైర్యాన్ని చూసిందని, విన్నదని, చర్యలు కూడా తీసుకుంటోందని అన్నారు.