indonesia : ఇండోనేసియాలో ఆకస్మిక వరదలు.. పదహారు మంది మృతి
ఇండోనేసియాలో భారీ వరదలు సంభవించాయి
ఇండోనేసియాలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా దాదాపు పదహారు మంది మరణించినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇండోనేసియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో వచ్చిన వరదలతో అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. అనేక మంది గల్లంతయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ఎంతమంది గల్లంతయ్యారన్నది తెలియడం లేదు. ఒక్కసారిగా కుండపోత వర్షాలతో వరదలు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
నదులు ఉప్పొంగి...
నదులు ఉప్పొంగడంతో పాటు సియావు తగులాండాంగ్ బియారో జిల్లాలో వరద నీరు ప్రవేశించింది. అనేక గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో పాటు గ్రామాలన్నీ బురద, రాళ్లతో నిండిపోయాయి. తెల్లవారు జామున ఆకస్మిక వరదలు సంభవించడంతో నిద్రలోనే అనేక మంది మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరు ఒక్కసారిగా గ్రామాలపై పడటంతో ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రజలు విలవిలలాడిపోయారరు. దాదాపు 140కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, వెయ్యికి మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు.
రహదారులు దెబ్బతినడంతో...
వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. అయితే రోహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రభావితమైన ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాలంటే కష్టమయింది. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దీంతో ప్రభుత్వం సితారో జిల్లాలో మరో రెండు వారాలు ఎమెర్జెన్సీని ప్రకటించింది. పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.