Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదా? ఆ శిక్షలు అలాంటివా?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత రెండేళ్ల నుంచి జైలులో ఉన్నారు

Update: 2025-12-24 02:01 GMT

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత రెండేళ్ల నుంచి జైలులో ఉన్నారు. పాకిస్తాన్‌ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ "ఆసిమ్‌" చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపు నిచ్చారు. తన పార్టీకి చెందిన సోహైల్‌ అఫ్రిదిని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలు దేశ రక్షణ దళాల చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ను ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 73 ఏళ్ల ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో ప్రధాని పదవి నుంచి తప్పిన తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా విదేశాల నుంచి బహుమతులు తీసుకున్న అవినీతి కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి కోర్టు పదిహేడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఉద్యమానికి పిలుపు...
“సోహైల్‌ అఫ్రిదికి నా సందేశం ఇదే. వీధి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. హక్కుల కోసం యావత్‌ దేశం లేచిరావాలి. న్యాయం కోసం పోరాటం పవిత్ర బాధ్యత. నా దేశానికి నిజమైన స్వేచ్ఛ కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం” అని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎక్స్‌లో రాసారు.‘తీర్పులు ముందే రాస్తున్నారు’ పాకిస్తాన్‌ పూర్తిగా ‘ఆసిమ్‌ చట్టం’ ఆధీనంలో నడుస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. “ఇక్కడ తీర్పులు ముందే రాస్తున్నారు. బహిరంగంగా చదివి వినిపించడమే మిగిలింది. గత మూడేళ్లలో వచ్చిన ఆధారాల్లేని తీర్పుల్లానే బహుమతి కేసు తీర్పు కూడా కొత్తది కాదు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయకుండా, తొందరపాటులో ఈ తీర్పు ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.
తన నిర్బంధంపై...
తనపై, భార్యపై విధించిన నిర్బంధం తీవ్ర మానసిక వేధింపులేనని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. తమకుక పుస్తకాలు, టీవీ, ములాఖత్ లకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇతర ఖైదీలందరికీ టీవీ సౌకర్యం ఉందని, కానీ బుష్రా బీబీకి, తనకు మాత్రం వాటిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు పంపిన పుస్తకాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారాల తరబడి మమ్మల్ని ఒంటరి నిర్బంధంలో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఖాన్ వాపోయారు. ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో గత రెండేళ్ల నుంచి జైలులో ఉన్నారు. ఆయనను ఎవరినీ కలుసుకునేందుకు అనుమతించకపోవడంపై ఇటవల ఆయన సోదరి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News