హాలోవీన్ పార్టీకి సినీతార రావడంతో ఎగబడ్డారు.. 149 మంది దుర్మరణం

Update: 2022-10-30 01:50 GMT

పాశ్చాత్య దేశాల్లో జరుపుకునే హాలోవీన్ పార్టీ తీవ్ర విషాదాన్ని నింపింది. హాలోవీన్ కోసం భారీగా ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. అయితే భారీగా జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక ప్రముఖ మార్కెట్‌లో జరిగిన తొక్కిసలాటలో 149 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. హాలోవీన్ ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారని అధికారులు తెలిపారు. ఇరుకైన వీధుల్లో గందరగోళం ఏర్పడడంతో తొక్కిసలాటతో పాటూ.. ఇంకొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారని అధికారులు తెలిపారు. బాధితులను కాపాడడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వందలాది దుకాణాలు, పార్టీ స్థలాలను కలిగి ఉన్న మెగాసిటీ సెంట్రల్ జిల్లా ఇటావాన్‌లో శనివారం రాత్రి సుమారు 1 లక్ష మంది ప్రజలు గుమిగూడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

కోవిడ్ పరిమితుల కారణంగా గత రెండు సంవత్సరాలు ఇలాంటి వేడుకలను నిర్వహించలేదు. హాలోవీన్ తాజాగా నిర్వహించడంతో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు ఒక హోటల్ దగ్గర స్పృహతప్పి పడిపోయారని ది కొరియా హెరాల్డ్ నివేదించింది. 10.30 గంటలకు పలువురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. గంట వ్యవధిలో ఆ సంఖ్య 100 దాటిందని.. చాలా మంది తొక్కిసలాటలో గాయపడగా.. ఇంకొందరికి అసలు ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. సమీపంలోని ఓ బార్‌కు సినీతార ఒకరు వచ్చారన్న సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు కూడా చెబుతున్నారు.


Tags:    

Similar News