తెలంగాణకు చెందిన కొమ్మారెడ్డి సుశీల్ కుటుంబానికి అమెరికాలో ఘోర కారు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అనూష కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు

Update: 2024-04-03 08:03 GMT

అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ తెలుగు కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందగా, వారి తల్లిదండ్రులు బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్ రెడ్డితో పాటు 11 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. మార్చి 29న జాక్సన్ కౌంటీలో కారు ప్రమాదంలో వీరు గాయపడ్డారు. సుశీల్ రెడ్డి కుమారుడు అద్వైత్ కోసం క్రానియల్ ఫేషియల్ థెరపీ సెషన్ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలబామా లో కొమ్మారెడ్డి సుశీల్ రెడ్డి కుటుంబం నివాసముంటుంది. కాటన్డేల్ సమీపంలో వారి వాహనం మరొక కారును అధిగమించేందుకు ప్రయత్నించినప్పుడు యాక్సిడెంట్ అయింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
వీరు ప్రయాణిస్తున్న కారు ముందుగా చెట్టును, ఆపై మరో చెట్టును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని తల్లాహస్సీలోని ఆసుపత్రికి విమానంలో తరలించగా, మరుసటి రోజు మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో దోథాన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుననారు. అక్కడ సుశీల్ రెడ్డితో పాటు అతని మరో కుమారుడు 11 ఏళ్ల అద్వైత్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లకు చెందిన ఈ కుటుంబం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరికి వైద్య ఖర్చుల కోసం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక సాయం అందించాలంటూ...
ఇప్పటికే కొందరు స్నేహితులు సాయపడుతున్నా ఆర్థికంగా ఎక్కువ భారం కావడంతో దాతలు స్పందించాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి వారిని అన్ని రకాలుగా కాపాడుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి అవసరమైన వైద్య సాయం అందించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో ఈ అభ్యర్థనతో మీ ముందుకు వస్తున్నట్లు తెలిపారు. మీరు చేసే చిన్న సాయం ఒక కుటుంబాన్ని నిలబెడుతుందని ప్రార్థిస్తున్నారు.


Tags:    

Similar News