Elon Musk Neuralink : మెదడులో చిప్.. ఇక చింతలేని జీవితమంటున్న మస్క్

మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు.

Update: 2024-01-31 07:34 GMT

మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఇది విజయవంతమయిందని ఆయన చెప్పడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఈ వార్త ను గమనించింది. ఒకవ్యక్తికి విజయవంతంగా చిప్ ను అమర్చామని మస్క్ తెలిపారు చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. న్యూరాలింగ్ చిప్ ను ఇప్పటికే జంతువుల్లో పరీక్షించారు. అది విజయవంతం కావడంతో మానవ మెదడులోకి చిప్ ను జొప్పించారు. ఇది కూడా విజయవంతమని పూర్తి స్థాయిలో తేలితే మాత్రం విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగంలో కీలక అడుగు పడినట్లేనని భావిస్తున్నారు.

ఇప్లాంట్ చేశామంటూ...
వైర్‌లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ఇంప్లాంట్ ఇదే తొలిసారి ఎలన్ మస్క్ ప్రకటించడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మానవ మెదడులో ఉన్న ఆలోచనలను ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి వాటిని ఆదేశాలుగా మలచి నియంత్రించే ప్రయోగం సక్సెస్ అయిందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ప్రయోగం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమయింది. 2016 లో న్యూరాలింక్ అనే సంస్థను స్థాపించి ఈ ప్రయోగాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. Motor Neurone Disease తో వీల్ ఛెయిర్ కే పరిమితమైన వారికి ఈ ఇంప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
కోలుకుంటుండటంతో...
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ తరహా చిప్ నే న్యూరాలింక్ తయారు చేసింది. ఈ ఇంప్లాంట్ ను అమర్చిన వ్యక్తి కోలుకుంటుండంటంతో సక్సెస్ అయిందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి ఎక్స్ ద్వారా ఎలాన్ మస్క్ తెలపడంతో అనేక మంది ఆశ్చర్యంతో పాటు అద్థుతమని ప్రశంసిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఈ ఇంప్లాంట్‌‌కు టెలిపతి అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు. తొలి ప్రయత్నంలో వివిధ కారణాలతో అవయవాలను కోల్పోయిన వారికి అమరుస్తామని చెప్పారాయన. అయితే మనిషి మెదడులోని ఆలోచనలను వేగంగా ప్రసారం చేయడం లక్ష్యమని చెప్పిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం మౌస్, కీ బీర్డును నియంత్రించడమే తమ ప్రధమ లక్ష్యమని వివరించారు. న్యూరాలింక్ సంస్థ రూపొందించిన ఇంప్లాంట్ ను అమెరికా ఐషధ నియంత్రణ సంస్థ కూడా అనుమతిచ్చింది.
వెంట్రుక పరిణామానికి...
న్యూరాలింగ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో ఎనిమిది మిల్లీ మీటర్ల వ్యాసంలో ఎన్ 1 అనే చిప్ ఉంటుంది. దానికి వెంట్రుక మందంలో ఉండే ఎలక్ట్రోడ్లు ఉంటాయని చెప్పారు. మనిషి పుర్రెెకు రంధ్రంచేసి అందులోకి ఎన్ 1న చిప్ ను అమరుస్తారు. ఈచిప్ కు అనుసంధానమై ఉండే అతి చిన్నవిగా ఉండే ఎలక్రోడ్లను మెదడులోకి పంపుతారు. ఒక చిప్ లో మూడువేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయని చెబుతున్నారు. మెదడులోని ముఖ్యమైన భాగాలకు పంపేలా అనుసంధానిస్తారు. దీంతో మెదడులో ఆలోచనలను ఆదేశాలుగా మార్చి సందేశాల రూపంలో పంపనున్నాయి. మరి ఇది ఎంత వరకూ సురక్షితమన్నది మాత్రం ఇంకా తెలియకున్నా మానవ మెదడులోకి చిప్ ను చొప్పించి సందేశాలను ఆదేశాలుగా మార్చి సంకేతాలను పంపడం మాత్రం ఎలాన్ మస్క సంస్థ న్యూరాలింక్ పరిశోధనల్లో అద్భుత ఆవిష్కరణ అని చెప్పాలి.


Tags:    

Similar News