చైనా, యూకేలో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు

అతిపెద్ద నగరమైన షాంఘైలో రోజువారీ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం..

Update: 2022-04-06 08:53 GMT

డ్రాగన్ కంట్రీ చైనా, యూకేలో కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. ఆ రెండు దేశాల్లో గతంలో కరోనా అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరోనా విరుచుకుపడుతోంది. ఈ ఏడాది 2 వేలతో మొదలైన రోజువారీ కేసులు 20 వేలకు చేరాయి. చైనాలో ఒక్కరోజే సుమారు 20 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఓ నివేదికలో పేర్కొంది. అక్కడ కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రయత్నం విఫలం కావడంతో చైనాలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

అతిపెద్ద నగరమైన షాంఘైలో రోజువారీ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌తో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపైనా కఠిన ఆంక్షలు విధించింది. కరోనా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. కాగా.. కేసులు పెరుగుతున్నప్పటికీ కొత్తగా కరోనా మరణాలు నమోదుకాకపోవడం కాస్త ఉపశమనాన్నిచ్చిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.
యూకేలో మార్చి నుంచి అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA.2 కేసులు వెలుగు చూస్తున్నాయి. అక్కడ నమోదవుతున్న కేసుల్లో.. 90 శాతం కేసులు ఈ వేరియంట్ కు చెందినవేనని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ నేతృత్వంలోని రియాక్ట్‌-1 అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి క్షీణించడంతో కరోనా తీవ్రత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News