Operation Sindoor :ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా ఇలా వాడుకుందా?
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ యుద్ధవిమానాల విక్రయాలను దెబ్బతీయడానికి చైనా పెద్దఎత్తున దుష్ప్రచారం చేసింది
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ యుద్ధవిమానాల విక్రయాలను దెబ్బతీయడానికి చైనా పెద్దఎత్తున దుష్ప్రచారం చేసిందని అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అమెరికా - చైనా ఆర్థిక–భద్రతా సమీక్ష కమిషన్ ఆరోపించింది. నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో చైనా తయారు చేసిన AI చిత్రాలను ప్రచారం చేస్తూ ఈ ప్రచారాన్ని చేసిందని కమిషన్ తన వార్షిక నివేదికలో తెలిపింది. రాఫెల్ విక్రయాలపై రాజకీయ ప్రయోజనాలే లక్ష్యం అని కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఫ్రాన్స్ రాఫెల్‌కు పోటీగా తమ J–35 యుద్ధవిమానాలను ప్రోత్సహించడానికి చైనా ఈ దుష్ప్రచారాన్ని నిర్వహించింది.
రాఫెల్ ను తమ ఆయుధాలు...
రాఫెల్‌లను చైనా ఆయుధాలు కూల్చేశాయన్నట్టుగా నకిలీ చిత్రాలు తయారుచేసి ప్రచారం చేసిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అలాగే, భారత–పాక్ ఉద్రిక్తతలను కూడా చైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని నివేదిక పేర్కొంది. మేలో రెండు దేశాల మధ్య తలెత్తిన ఇరుపక్షాల ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆయుధాల సామర్థ్యాలను ప్రచారం చేసుకోవడానికి చైనా ప్రయత్నించిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆధీన ప్రాంతాల్లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు, సైనిక వేదికలు ఈ దాడుల్లో నిలువునా ధ్వంసమయ్యాయి.
రెండు దేశాల మధ్య...
ఆగస్టులో భారత వాయుసేనాధ్యక్షుడు ఏపీ సింగ్ వెల్లడించిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధవిమానాలు, అతి పెద్ద ఎయిర్ బేస్ ధ్వంసమయ్యాయి. సరిహద్దు సమస్య పరిష్కారంపై రెండు దేశాల వైఖరిలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని కమిషన్ పేర్కొంది. చైనా ఉన్నతస్థాయి చర్చలతో కొంతమేర ముందడుగు వేయించినట్టుగా చూపిస్తూ, వాణిజ్య సహకారం వంటి రంగాల్లో దారి తెరవాలని చూస్తుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, భారత్ మాత్రం దృఢమైన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని కోరుకుంటోందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్ చైనా సరిహద్దు బెదిరింపులను మరింత గంభీరంగా పరిగణిస్తున్నదని కమిషన్ స్పష్టం చేసింది. భవిష్యత్ దలైలామా వారసత్వం సమస్య కూడా రెండు దేశాల మధ్య మరో ఉద్రిక్తతగా మారే అవకాశముందని కమిషన్ అంచనా వేసింది.