Hydraa : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు... సంధ్యా కన్వెన్షన్ కు చెందిన భవనం కూల్చివేత

హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది

Update: 2025-11-17 03:42 GMT

హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది. ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. అతి పెద్ద భవనాన్ని హైడ్రా అధికారుల బుల్ డోజర్లతో కూల్చివేస్తున్నారు. . గ‌చ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర‌రావు ఆక్ర‌మ‌ణ‌ల‌పై పలువురు బాధితులు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగ‌ళ‌వారం సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణలపై తీవ్ర అభ్యంతరం చేసిన నేపథ్యంలో నేడు ఉదయం నుంచి హైడ్రా అధికారులు బుల్ డోజర్లతో వచ్చి ఆక్రమిత నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ర‌హ‌దారులు ఆక్ర‌మించి ప‌లు నిర్మాణాలు చేప‌ట్ట‌డాన్ని సీరియ‌స్‌ గా ప‌రిగ‌ణించింది.

మెజారిటీ ప్లాట్లు తనవేనని...
గచ్చిబౌలి పరిధిలో మొత్తం ఇరవై ఎక‌రాల ప‌రిధిలో వేసిన లే అవుట్‌లో 162 వ‌ర‌కు ప్లాట్లుండ‌గా.. అందులోని మెజార్టీ ప్లాట్లు తనవే అన్నఉద్దేశ్యంతో ర‌హ‌దారులు, పార్కులు ఆక్ర‌మిస్తే వ్య‌వ‌స్థ‌లు చూస్తూ ఊరుకోవ‌ని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింద‌ని పేర్కొంది. ఒక‌సారి లే అవుట్ వేస్తే.. అదే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. సంధ్యా శ్రీ‌ధ‌ర్ రావు ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను ఇటీవ‌ల హైడ్రా తొల‌గించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై సంధ్యా శ్రీధ‌ర‌రావు హైకోర్టును ఆశ్ర‌యించారు.ఈ సంద‌ర్భంగా బాధిత ప్లాట్ య‌జ‌మానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్న‌వించుకున్నారు. లే అవుట్‌లో స‌రిహ‌ద్దుల‌న్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని సంధ్యా శ్రీ‌ధ‌ర్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. త‌మ‌ను భ‌య‌పెట్టి మిగ‌తావి కూడా సొంతం చేసుకోవాల‌ని సంధ్యా శ్రీ‌ధ‌ర‌రావు ప్ర‌య‌త్నించార‌ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
ఎక్కువ ఫ్లాట్లు ఉన్నాయని...
ఎక్కువ ప్లాట్లు త‌న‌వే ఉన్నాయ‌ని.. లే అవుట్‌లోని ర‌హ‌దారులు, ఆ ప‌క్క‌నే ఉన్న త‌మ ప్లాట్లు, పార్కులు స‌రిహ‌ద్దులు ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌ట్టార‌ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేరుగా దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. హైడ్రా అధికారులు వెంట‌నే స్పందించి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించాక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని పేర్కొన్నారు. మాకు పెట్టిన ఇబ్బందులను కోర్టుకు విన్నవించుకోవడానికే తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు. లే అవుట్‌లోని ర‌హ‌దారుల‌ను, పార్కుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని హైడ్రాకు హైకోర్టు మ‌రోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
Tags:    

Similar News