Hydra : ఎంత ధైర్యం.. బౌన్సర్లు.. కుక్కల కాపలాతో 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ

హైదరాబాద్ లో ఐదు ఎకారాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2025-10-10 06:40 GMT

హైదరాబాద్ లో ఐదు ఎకారాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లో అతి ఖరీదైన స్థలాన్ని తిరిగి ప్రభుత్వం పరం చేసుకుంది. ఈ భూమి విలువ 750 కోట్ల రూపాయలుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 లో ఆక్రమణలను హైడ్రా ఈ ఉదయం నుంచి తొలిగించింది. ఈ భూమిలోని ఐదు ఎకరాల్లో గతంలో 1.20 ఎకరాలను ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. అయితే ఈ భూమి తనదంటూ పార్ధసారధి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పాటు స్థలానికి కాపలాగా బౌన్సర్లతో పాటు కాపలా కుక్కలను కూడా ఉంచాడు. అందులో తాత్కాలికంగా షెడ్లను నిర్మించాడు.


అధికారుల ఫిర్యాదుతో...
జలమండలి అధికారులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరికి తోడు రెవెన్యూ అధికారులు కూడా హైడ్రాను అప్రోచ్ అయి ఆ స్థలం ప్రభుత్వానిదని, ఆక్రమణలకు గురయిందని తెలిపారు. గతంలో నీటి ట్యాంకును ఈ స్థలంలో నిర్మించాలని జలమండలి చేసిన ప్రయత్నాలను కూడా పార్ధసారధి అడ్డుకున్నాడు. నకిలీ పత్రాలను సృష్టించి అత్యంత విలువైన భూమిని తాను సొంతం చేసుకోవాలని భావించాడు. అందుకోసం పార్ధసారధి అడ్డదారులు తొక్కినట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు గుర్తించారు. 403 సర్వే నెంబరులో ప్రభుత్వ భూమి ఉంటే పార్థసారధి 403/2 సర్వే నెంబరుతో్ ఆక్రమణలకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.

ఫెన్సింగ్ ఏర్పాటు చేసి...
ఇందుకోసం పార్థసారధి రిజిస్టర్ సేల్ డీడ్ కూడా చేసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడంతో హైడ్రా అధికారులు రంగ ప్రవేశం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడానికి చేసిన ప్రయత్నాలను హైడ్రా అధికారులు వమ్ము చేశారు. పార్ధసారధి వేసిన ఫెన్సింగ్ ను తొలగించడమే కాకుండా లోపల ఉన్న షెడ్లను కూడా హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా అధికారులు మళ్లీ తాము ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబరుతో సహా వివరిస్తూ, ఆక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బోర్డు కూడా పెట్టారు. 750 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News