గాజుల రామారం కూల్చివేతలపై రంగనాధ్ సంచలన కామెంట్స్
గాజుల రామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ స్పందించారు
గాజుల రామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ స్పందించారు. మొత్తం మూడు వందల పదిహేడు ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలిపారు. మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, స్థానిక రాజకీయ నేతలు ఆక్రమించారని తెలిపారు. యాభై, వంద గజాల చొప్పున పేదలకు విక్రయించారని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పారు.
పేదల ఇళ్ల విషయంలో మాత్రం...
ప్రభుత్వ భూములను కాపాడటంలో భాగంగా ఈరోజు గాజుల రామారంలో కూల్చివేతలను ప్రారంభించామని తెలిపారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసి కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తమ విచారణలో వెల్లడయిందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పారు. అయితే ఈ కూల్చివేతలలో పేదల ఇళ్లను మాత్రం కూల్చవద్దని తమ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. నలభై ఎకరాల్లో పేదలు నివసిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పారు.