Heart Attacks: జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు

ఇటీవల కాలంలో జిమ్‌ చేస్తున్న యువకులు సైతం గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. గతంలో

Update: 2024-03-18 04:30 GMT

gym

ఇటీవల కాలంలో జిమ్‌ చేస్తున్న యువకులు సైతం గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. గతంలో వయసుపైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు, గుండెపోటు వంటివి వచ్చేవి. కానీ ఇప్పుడున్న కాలంలో యువకుల్లో సైతం గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. గతంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ ఇలా ఎంతో మంది సెలబ్రేటీలు, రాజకీయ నేతలు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిమ్ చేసే అలవాటు ఉన్న యువకుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.

అయితే అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని, అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె రక్తనాళాల్లో చీలిక ఏర్పడితే ఎలాంటి వ్యక్తులకు అయినా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కొంతమందిలో బ్లాక్స్ లేకపోయినా అకస్మాత్తుగా రక్తం గడ్డ కడుతుందని, అలాంటి వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఏదైనా గుండె సంబంధిత, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు వ్యాయామాలు చేసే సమయంలో తగుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటున్నారు.బీపీ, షుగర్‌ వంటి సమస్యలున్నవారు వైద్యుల సలహాతోనే జిమ్ చేయడం ఉత్తమం. అలాగే జిమ్‌లో చేసే పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో భారీ ఎక్సర్‌సైజులను తట్టుకునే సామర్ధ్యం శరీరానికి ఉండదని, శరీర సామర్థ్యం ఆధారంగానే జిమ్‌ చేయాలంటున్నారు.ముఖ్యంగా కార్డియో ఎక్సర్‌సైజుల తరువాత 2-5 నిమిషాలు విరామం అవసరమని, గుండెకు కాస్త ప్రశాంతత లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలా అనిపిస్తే వ్యాయామం ఆపేయాలి

ఛాతి ఎడమ భాగంలో నొప్పిగా అనిపిస్తే వెంటనే వ్యాయామం చేయడం ఆపాలంటున్నారు వైద్యులు. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు, గుండెపోటు చరిత్ర ఉన్న కుటుంబీకులు జిమ్‌లో ఎక్కువగా చేయకూడదని, గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని.. ప్రతిరోజు శరీరం సామర్థ్యం ఆధారంగా 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News