రెండు రూపాయలతో ఎక్కువ పోషక విలువలు

సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్లను మార్చుకోవద్దంటున్నారు

Update: 2026-01-18 05:08 GMT

సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్లను మార్చుకోవద్దంటున్నారు. ప్రకృతి మనకు ఇచ్చే అనేక రకాలైన ఔషధాలు అనేక రూపాల్లో నిత్యం దర్శనమిస్తుంటాయి. అందులో తేగలు ఒకటి. సీజనల్‌ ఫుడ్స్‌లో తేగకు మంచి గిరాకీ ఉంది. తాటి కాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటి గురించి తెలిసిన చాలా మంది పెద్దలు ఎక్కడ తేగలు కనిపించినా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో తేగలు విరివిగా లభిస్తున్నాయి. ఒక్కొక్క తేగ ఖరీదు రెండు రూపాయలు మాత్రమే. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన తేగలు ఎలా తయారవుతాయంటే...?

తాటి చెట్ల నుంచి...
తాటి చెట్లకు ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కాయలు కాస్తాయి. ఏప్రిల్‌, మే మాసాల్లో ముంజలు వస్తాయి. జూన్‌, జూలై మాసాల్లో చెట్లకు ఉన్న తాటి కాయలు పండ్లుగా తయారవుతాయి. అలా తయారైన పండ్లు చెట్ల నుంచి రాలిపోతాయి. ఒక్కొక్క కాయకు మూడేసి గింజలు చొప్పున ఉంటాయి. అలా రాలిన పండ్లను కొందరు సేకరించి నేలలో గొయ్యి తీసి పూడుస్తారు. అలా పూడ్చిన పండు నుంచి మొలకలు వచ్చి, అవి ఊరి, తేగలుగా తయారయ్యేందుకు మూడు మాసాలు పడుతుంది. అలా తయారైన తేగలను గింజల నుంచి వేరు చేసి, కుండల్లో పెట్టి బట్టీలా పేర్చి కాల్చుతారు. కుండ చల్లారిన తర్వాత కాలిన తేగలను సేకరిస్తారు. అలా సేకరించిన తేగలను కట్టలు కట్టి, మార్కెట్‌లో విక్రయించుకొని చాలా మంది జీవిస్తుంటారు.
తేగలు కనిపడితే...
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తేగల తయారీ, అమ్మకాన్ని జీవనాధారంగా చేసుకొని కొన్ని కుటుంబాలు జీవిస్తుంటాయి. పల్లెల్లో చాలా మంది తాటి తోపులున్న చోట తేగలను స్వయంగా కూడా తయారు చేసుకుంటారు. కేవలం తేగల అమ్మకాలపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు అనేకం ఉంటాయి. అందుకే శరీరంలో అత్యధిక పోషకాలు కావాలంటే కనిపించిన వెంటనే తేగలను కొనుగోలు చేయాలి. వాటిని తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా మటుమాయం అవుతాయని చెబుతున్నారు. అందుకే ఎక్కడ కనిపించినా తేగలను వదొలొద్దండీ.. తెలియని ఈ జనరేషన్ కు కూడా వాటి రుచి చూపించండి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తేగలను తినవచ్చు. దీనికి ఎలాంటి వైద్య పరమైన ఆంక్షలు లేవు.


Tags:    

Similar News