Andhra Pradesh : డేంజర్ మిల్క్.. మీ ఇంటికి వస్తుందా? అయితే కనిపెట్టండిలా
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించిన ఘటన కలకలం రేపింది.
అన్నీ కల్తీ. చివరకు పాలు కూడా కల్తీవే. మార్కెట్ లో దొరికే ఏ వస్తువు అయినా కల్తీరాయులు సులువుగా చేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించిన ఘటన కలకలం రేపింది. పాలలో కూడా కల్తీ చేసి మరింత వ్యవస్థ దిగజారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నకిలీ మందులు మార్కెట్ లో ఇష్టారాజ్యంగా ప్రవేశిస్తున్నాయి. కల్తీని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతోనే ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే కల్తీ పాలను సులువుగా తమ ఇంట్లోనే గుర్తించవచ్చని, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాల ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవచ్చని వైద్యులు తెలిపారు.
ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా...
పాలు చిక్కగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియం సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారు. వీటితో పాటు బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ వంటి డేంజర్ రసాయనాలు కలుపుతున్నారు. ఈ రసాయనాలు ఉన్న.. కల్తీ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుంది. ఇలాంటి కల్తీ పాలను ఇంట్లోనే ఎలా కనిపెట్టాలంటే...ఇంట్లో చదునుగా ఉండే బండపై రెండు చుక్కల పాలను వేయండి. అది ఏదో ఓవైపు పారుతుంది. పాలు పారిన వైపు తెల్లగా కనిపిస్తే.. అవి స్వచ్ఛమైనవి అని నిర్ధారించుకోవాలి. కల్తీ పాలు అయితే.. తెల్లగా కనిపించవు. మార్కెట్లో దొరికే పీహెచ్ స్ట్రిప్‌తోనూ పాల కల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేయండి. ph రేషియో 6.4 - 6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని గుర్తించుకోవాలి. అంతకన్నా తక్కువ కానీ, ఎక్కువ ఉంటే పాలు కల్తీ పాలు జరుగుతుందని అర్థం.
ఈ పరీక్షల ద్వారా...
ఈ పరీక్షల ద్వారా కూడా పాల కల్తీని కనిపెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా టెస్ట్ ట్యూబ్‌లో 5మి.లీ పాలు తీసుకోవాలి. ఇందులో రెండు మిల్లీ లీటర్ల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. ఇది బాగా మిక్స్ చేయండి. స్వచ్ఛమైన పాలు అయితే.. దాని రంగు లేత గోధుమ రంగులోకి మారిపోతుంది. అదే, కల్తీ పాలు అయితే.. దాని రంగు లైట్ చాక్లెట్ కలర్‌లోకి మారుతుంది. పాలలో గంజి లేదా ఏదైనా పిండి పదార్థం కలిపితే.. ఆ రంగు మాత్రం నీలంలో ఉంటుందని గుర్తించుకోవాలి. ఇలా టెస్ట్ చేసి.. పాల క్వాలిటీని తెలుసుకోవచ్చు. పాలలో డిటర్జెంట్ పొడిని కూడా కలుపుతారు. ఈ పొడిని కలిపారేమో గుర్తించాలంటే.. ఒక గ్లాసులో కొంచెం పాలు తీసుకోండి. అంతే మొత్తంలో నీరు కూడా తీసుకోండి. ఈ రెండింటి బాగా మిక్స్ చేసి.. గిరాగిరా తిప్పండి. డిటర్జెంట్ అవశేషాలు ఉంటే అవి బాగా నురగ వస్తాయి. దీంతో.. పాలు కల్తీ జరిగిందని గుర్తించాలి.
మార్కెట్ లో దొరికే...
ఒకవేళ స్వచ్ఛమైన పాలైతే.. చాలా తక్కువ నురగ వస్తుందంటున్నారు నిపుణులు. కల్తీ పాలు కోసం 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను బాగా కలుపుతారు. దీంతో ఆ మిశ్రమం పాలలా తెల్లగా మారిపోతుంది. పాల వాసన వచ్చేందుకు కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. ఇక, పాలలో యూరియా అవశేషాలు గుర్తించడానికి మార్కెట్‌లో యూరియాసే స్ట్రిప్స్ దొరుకుతాయి. వాటి మీద కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపించాయంటే.. పాలు యూరియాతో తయారు చేశారని అర్థం. ఈ పాలు ఆరోగ్యానికి చాలా డేంజర్. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతుల వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు.. పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు