Thurakapalem : తురకపాలెంలో వరస మరణాలకు కారణమదేనా? ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయినట్లేనా?
గుంటూరు జిల్లా తురకలపాలెంలో వరస మరణాలకు కారణంపై అధ్యయనం జరుగుతుంది. దీనిపై ఒక క్లారిటీకి రానుంది.
గుంటూరు జిల్లా తురకలపాలెంలో వరస మరణాలకు కారణంపై అధ్యయనం జరుగుతుంది. దీనిపై ఒక క్లారిటీకి రానుంది. తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. 46 ఏళ్ల వ్యక్తికి మెలియాయిడోసిస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. అయితే గుంటూరు జిల్లాలో జరుగుతున్న వరస మరణాలపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. గుంటూరు జిల్లా తురకపాలేంలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు.
నిలకడగానే ఆరోగ్యం...
నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా, మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత వైద్యపరీక్షల కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఇదివరకే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో మరింత మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గుంటూరులో చికిత్స పొందుతున్న వారి న ఆరోగ్య పరిస్థితి కూడా స్థిరంగానే ఉందని అధికారులు వెల్లడించారు.
రక్తనమూనాలను సేకరించి...
గ్రామస్థుల నుంచి పెద్దఎత్తున రక్త నమూనాలు సేకరించారు. తురకపాలెం గ్రామంలో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు, అనుమానిత లక్షణాలతో ఉన్న 72 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. మరో 14 మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా, మిగిలిన నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమయిన అధికారులు గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య చర్యలు నిర్వహిస్తున్నారు. మొత్తం నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు, ఇంటింటికీ ఆహారం, సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నిపుణుల బృందం గ్రామాన్ని సందర్శించనుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొత్తం తురకపాలెంలోనే ఉంది. తాగునీటితో ఇబ్బందులున్నాయని భావిస్తున్నారు.