చాట్ జీపీటీ లేటెస్ట్ వర్షన్ వచ్చేసింది.. ఇకపై ఖచ్చితమైన సమాధానాలతో..

ఈ యాప్ ద్వారా భాషా అనువాదం, మనకు తెలియని విషయాలను తెలియపరచడం, వివరణాత్మక స్పందనలు..

Update: 2023-03-15 05:08 GMT

uses of chat gpt 4

చాట్ జీపీటీ. 2022 నవంబర్ లో ఓపెన్ ఏఐ సంస్థ దీనిని లాంచ్ చేసింది. ఇదొక చాట్ బాట్. నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది. ఈ యాప్ ద్వారా భాషా అనువాదం, మనకు తెలియని విషయాలను తెలియపరచడం, వివరణాత్మక స్పందనలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే ఖచ్చితమైన సమాధానాలు లేవన్నది అప్పట్లో ముఖ్యమైన లోపంగా గుర్తించబడింది. పెద్ద టెక్స్ట్ కార్పోరా నుండి సమాచారాన్ని తిరిగి పొందడానికి ChatGPTని ఉపయోగించవచ్చు. తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీ అప్ డేట్ వర్షన్ ను తీసుకొచ్చింది. అదే చాట్ జీపీటీ-4. ఇది దాదాపు మనిషిలాగే పనిచేస్తుందని సంస్థ వివరించింది. మనిషి లాంటి టెక్నాలజీ ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ ప్లాన్ చాట్‍జీపీటీ ప్లస్ సబ్‍స్క్రైబర్లకు ఈ జీపీటీ-4 అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కంటే జీపీటీ-4 టెక్నాలజీ అత్యుత్తమంగా ఉండనుంది. అందుకే చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. “మేం జీపీటీ-4ను క్రియేట్ చేశాం. డీప్ లెర్నింగ్‍లో మరింత ముందుకు వెళ్లేందుకు ఓపెన్ ఏఐకి ఇది ఓ మైలురాయిగా నిలిచింది” అని ఓపెన్ ఏఐ తన బ్లాగ్‍లో వెల్లడించింది. కొన్ని ప్రొఫెషనల్, అకడమిక్ టాస్కులను ఈ జీపీటీ-4 మనిషి స్థాయిలో చేస్తుందని వివరించింది. క్లిష్టమైన ప్రశ్నలు, ప్రాబ్లమ్ లకు కూడా ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ ప్రకటించింది.
భవిష్యత్ లో ఇమేజ్ ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా చాట్ జీపీటీ 4 ను రూపొందించారు. ఉదాహరణకు ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) లోపలి భాగాన్ని ఫోటో తీసి జీపీటీ-4లో అప్ లోడ్ చేస్తే.. అందులో ఉన్న పదార్థాలతో ఏయే వంటలు చేయొచ్చు. ఎన్నిరకాల వంటలు, ఎలా చేయొచ్చో చెబుతుంది. టెక్స్ట్ రూపంలో ఏదైనా ప్రశ్న అడిగితే.. చాట్‍జీపీటీ వివరంగా, వేగంగా టెక్ట్స్ రూపంలో సమాధానాలు ఇస్తుంది. అడిగిన ప్రశ్నకు ఓ ఆన్సర్‌ను అందుబాటులో ఉన్న వివరాలన్నింటితో కలిపి ఇస్తుంది. కోడింగ్, మ్యాథమేటిక్స్, హిస్టరీ, రెసిపీలు ఇలా ఒక్కటేంటి ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది.


Tags:    

Similar News