ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ ఇండియా విమానం కూలిపోయే ముందు చివరి క్షణాలను వైరల్ వీడియో చూపడం లేదు
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171, టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిన ప్రమాదంలో
smoke in Ryanair flight
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171, టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది, ఫలితంగా మరింత మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న మొత్తం 242 మంది ప్రయాణికులలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ప్రయాణికులు కాకుండా, కళాశాల భవనంలో చాలా మంది మరణించారు. దీని ఫలితంగా 270 మంది మరణించారు. ఈ సంఘటన మొత్తం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా షాక్ కు కారణమైంది. విమానం లోని రెండు బ్లాక్ బాక్స్‌లను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకోవడం దర్యాప్తులో కీలకమైన సాక్ష్యంగా మారనుంది.
ఇంతలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనేక పాత, తప్పుదారి పట్టించే చిత్రాలు మరియు వీడియోలతో నిండిపోయాయి. వాటిలో ఒకటి విమానం క్యాబిన్ పూర్తిగా పొగతో నిండిపోయి ప్రయాణీకులు భయాందోళనలకు దారితీసిన వీడియో. ఈ వీడియో వినాశకరమైన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం చివరి క్షణాలను చూపిస్తుందనే వాదనతో ప్రచారంలో ఉంది. “Air India inside crashing situation of passengers #viralvideoシ #yesterday #airplane #AirIndia #london #ahmedabad #crashed @highlight Highlights E V E R Y T H I N G E X P L O R E” అంటూ పోస్టులు పెట్టారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుల ఆఖరి క్షణాలను చూపించే వీడియో అంటూ చెబుతున్నారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని వెతికినప్పుడు. ఆ వీడియో 2023 సంవత్సరం నుండి సర్క్యులేషన్‌లో ఉందని మేము కనుగొన్నాము.
servicestourimers అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆగస్టు 28, 2023న అదే వీడియోను షేర్ చేసింది. విమానం ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పనిచేయడం లేదనే శీర్షికతో షేర్ చేశారు.
మార్చి 18, 2023న Xలో షేర్ చేసిన మరో పోస్ట్ లో టర్కిష్ భాషలో ఉన్న క్యాప్షన్‌తో, Ryanair B737 విమానంలో జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను ఆందోళనకు గురి చేసిందని తెలిపింది. వెంటిలేషన్ వ్యవస్థ పని చేయడం లేదంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.
జనవరి 21, 2020న అప్లోడ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము, అదే వీడియోను ఇందులో షేర్ చేశారు. 737-800 విమానంలో క్యాబిన్‌లో పొగ వస్తున్నట్లు నివేదించిన తర్వాత రైనైర్ విమాన సిబ్బంది మేడే అంటూ ప్రకటించారు. విమానం 5000 అడుగుల వద్ద ఉండగా ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని నిమిషాల తర్వాత విమానంలో పరిస్థితి మెరుగుపడుతుందని సూచించింది. ఒక గంట తర్వాత రన్‌వే 26Rలో సురక్షితమైన ల్యాండింగ్ కోసం ఒటోపెనికి విమానం తిరిగి వచ్చింది. టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రకారం విమానం వయస్సు 7.9 సంవత్సరాలని అధికారులు తెలిపారు.
ఈ పోస్టు ఆధారంగా “Ryanair plane filled with smoke + 2020” అనే కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేశాం. ర్యాన్ ఏయిర్ విమానం క్యాబిన్ మధ్యలో దట్టమైన పొగ నిండిపోయినప్పుడు భయభ్రాంతులకు గురైన ప్రయాణీకులు కేకలు వేయడం, ఏడుపు వినిపించాయని వెబ్‌సైట్లలో ప్రచురించిన నివేదికలను మేము కనుగొన్నాము. బోయింగ్ 737-800 రొమేనియన్ రాజధాని బుకారెస్ట్ నుండి బయలుదేరి వేల అడుగుల ఎత్తుకు ఎగిరిన కొద్ది క్షణాల్లోనే క్యాబిన్ లో పొగ నిండిపోయింది.
వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసిన metro.co.uk ప్రకారం, ర్యాన్ ఏయిర్ విమానం అకస్మాత్తుగా దట్టమైన పొగతో నిండిపోయింది. బుకారెస్ట్ నుండి లండన్‌కు వెళ్లే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్యాబిన్‌లోకి పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. రొమేనియన్ రాజధాని నుండి బోయింగ్ 737-800 విమానం హెన్రీ కోండా అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి రావాల్సి వచ్చింది. అందులో 169 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం దిగిన తర్వాత ప్రయాణికులను ఖాళీ చేయించి, వైద్యులు పరీక్షించారు. అందరూ క్షేమంగా ఉన్నారని నివేదించారు.
ఈ వాదనను కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తోసిపుచ్చాయి.
కనుక, వైరల్ వీడియో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం చివరి క్షణాలను చూపించడం లేదని తెలుస్తోంది. ఇది ర్యాన్ ఏయిర్ కు చెందిన విమానం దట్టమైన పొగతో నిండిపోయిన ఘటనకు సంబంధించింది. ఇక విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, ప్రయాణీకులను ఖాళీ చేయించిన సంఘటన ఇది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో కూలిపోవడానికి ముందు ఎయిర్ ఇండియా విమానంలో చివరి క్షణాలను చూపించే వైరల్ వీడియో
Claimed By : Social media users
Fact Check : Unknown