ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో కనపడుతున్నవారు ఇటీవల అరెస్ట్ అయిన CRPF జవాన్లు కాదు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), పాకిస్తాన్ గూఢచర్య అధికారులకు రహస్య సమాచారం చేరవేసిన ఆరోపణలపై CRPF జవాన్ ను అరెస్టు
CRPF jawan
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), పాకిస్తాన్ గూఢచర్య అధికారులకు రహస్య సమాచారం చేరవేసిన ఆరోపణలపై CRPF జవాన్ ను అరెస్టు చేసింది. నిందితుడు మోతీ రామ్ జాట్ 2023 నుండి పాకిస్తాన్ హ్యాండ్లర్లతో జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకుంటున్నాడని సమాచారం. అతడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్లు 15 (ఉగ్రవాద చట్టానికి సంబంధించినది), 16 (ఉగ్రవాద చట్టానికి శిక్ష), 18 (కుట్ర మరియు సంబంధిత చర్యలు) కింద కేసు నమోదు చేశారు అని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. జాట్ 2023లో హనీట్రాప్‌కు గురయ్యాడని నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ అధికారులు ఒక మహిళగా నటిస్తూ సోషల్ మీడియాలో అతన్ని సంప్రదించి, తరువాత కాన్వాయ్ కదలికలు వంటి వివరాలను సేకరించారు.
దీనంతటి మధ్య, పోలీసు అధికారులతో ఇద్దరు వ్యక్తులు ఉన్న వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తూ, కనిపిస్తున్న వ్యక్తులు పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న ఇద్దరు BSF జవాన్లని దవా చేస్తున్నారు. వారిని 96 కోట్ల రూపాయలతో పట్టుకున్నారని తెలిపారు. వీడియోలో, పోలీసులు తమకు లభించిన డబ్బు గురించి వ్యక్తులను ప్రశ్నించడం మనం వినవచ్చు.
హిందీలో ఈ క్లెయిమ్ ఇలా ఉంది: “मिलिए देश के इन जयचंदों से जिन्होंने चंद पैसों के लिए देश को पाक के हाथों बेच... 2 BSF जवान - पाक जासूस... ये लोग ट्रेन में पकड़े गए, उनके पास 96 लाख रुपए नकद थे... जब कुदालों की तलाशी ली गई, तो एक घर में 96 करोड़ रुपए नकद मिले.!!” దీనిని అనువదిస్తే, "కొద్ది డబ్బు కోసం దేశాన్ని పాకిస్తాన్‌కు అమ్మేసిన దేశద్రోహులను కలవండి... 2 BSF జవాన్లు - పాక్ గూఢచారులు... వీరు రైలులో పట్టుబడ్డారు, వారి వద్ద 96 లక్షల రూపాయల నగదు ఉంది... ఇంటిని సోదా చేసినప్పుడు, ఒక ఇంట్లో 96 కోట్ల రూపాయల నగదు కనుగొనబడింది." అని ఉంది.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ అవాస్తవం.
మొదటగా, NIA అరెస్టు చేసిన CRPF సిబ్బంది గురించి కథనాలను పరిశీలించినప్పుడు, నిందితులను చూపిస్తున్న చిత్రాలు లేదా వీడియోలు మాకు కనిపించలేదు.
వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను సేకరించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికినప్పుడు, ఈ వీడియో 2018 సంవత్సరం నాటిదని తెలిసింది. కాన్పూర్ పోలీసులు కాన్పూర్ కి చెందిన ఆనంద్ ఖత్రీ అనే బిల్డర్ నుండి 96.40 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఉదంతాన్ని ఈ వీడియో చూపుతోంది అని తెలిసింది. ఈ వీడియోను జనవరి 27, 2018న "బ్రేకింగ్ న్యూస్ 96.40 కోట్లు కాన్పూర్ బిల్డర్ ఆనంద్ ఖత్రీ నుండి స్వాధీనం" అనే శీర్షికతో తాక్ ఝాంక్ (Taak Jhaank) అనే ఛానెల్ ప్రచురించింది.
మరింత వెతకగా, కాన్పూర్‌లో జరిగిన సంఘటన గురించి ఇతర వార్తా కథనాలు కూడా మాకు కనిపించాయి. వైరల్ వీడియోలోని దృశ్యాలతో సరిపోలిన నిందితుల చిత్రాలను ANI షేర్ చేసింది. రద్దు చేయబడిన కరెన్సీ రూ. 96 కోట్లు స్వాధీనం చేసుకున్న సంఘటనలో అరెస్టు చేయబడిన నిందితులందరినీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఆ ట్వీట్ పేర్కొంది.
ABPLive ప్రచురించిన నివేదిక ప్రకారం, కాన్పూర్ పోలీసులు బిల్డర్ పూర్వీకుల ఇంట్లో రద్దు చేయబడిన కరెన్సీ నోట్ల రూపంలో రూ. 96 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారనీ, ప్రముఖ బిల్డర్‌తో సహా 16 మందిని అరెస్టు చేసారనీ తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్న మొత్తం బిల్డర్ ఆనంద్ ఖత్రీకి చెందినది. అయితే, అక్కడ డజనుకు పైగా పనివారు ఉన్నారు. వీరందరినీ బిల్డర్‌తో పాటు అరెస్టు చేశారు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. నవంబర్ 2016లో రూ. 500, రూ. 1,000 పాత కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. చట్టవిరుద్ధమైన కరెన్సీని చట్టబద్ధమైన డబ్బుగా మార్చడంలో ప్రమేయం ఉన్న కొన్ని కంపెనీలు, వ్యక్తుల గురించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సమాచారాన్ని సేకరించి, కాన్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ సింగ్‌తో పంచుకుంది. దానిపై కాన్పూర్ పోలీసు యాక్షన్ తీసుకుంది.
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిదని, NIA అరెస్టు చేసిన CRPF జవాను ను చూపిస్తుందనే వాదన అవాస్తవం. ఈ వీడియో 2018 సంవత్సరం నాటిది, కాన్పూర్ పోలీసులు ఒక బిల్డర్ నుండి 96 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలను చూపుతుంది.