ఫ్యాక్ట్ చెక్: వారణాసిలో జన్మాష్టమి రోజున పోలీసులు కోతులకు ఆహారం వడ్డిచారంటూ వైరల్ అవుతున్న వీడియో ఏఐ తో చేసింది

శ్రీకృష్ణ జన్మదినోత్సవమైన జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఆగస్టు 16, 2025న ఘనంగా జరుపుకున్నారు. వేలాది వేలాది మంది భక్తులు ఆలయాలకు

Update: 2025-08-21 06:18 GMT

Janmashtami viral video

శ్రీకృష్ణ జన్మదినోత్సవమైన జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఆగస్టు 16, 2025న ఘనంగా జరుపుకున్నారు. వేలాది మంది భక్తులు ఆలయాలకు వెళ్లి భగవాన్ శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మథుర మరియు వృందావనలోని బాంకే బిహారి ఆలయం, ప్రేమ మందిర్, ఇస్కాన్ ఆలయం, శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం వంటి అనేక దేవాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి.

ఈ నేపథ్యంతో ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోలో కోతులు వరుసగా కూర్చొని భారతీయ సంప్రదాయ వంటకాలను తింటూ కనిపిస్తారు. వారణాసి పోలీసులు వారిని కాపాడుతున్నట్లు కూడా వీడియోలో చూపించారు. ఈ వీడియోను జన్మాష్టమి సందర్భంగా వారణాసి ఘాట్ వద్ద పోలీసులు కోతులకు భోజనం పెట్టారని పేర్కొంటూ వినియోగదారులు పంచుకుంటున్నారు.

ఆ వీడియోతో పాటు హిందీలో ఒక వ్యాఖ్య కూడా చేర్చబడింది. అందులో ఇలా ఉంది “उत्तर प्रदेश पुलिस तो यहां बिजी है, फिर चाहे प्रदेश में बलात्कार हों, आर्मी के जवान को टोल कर्मियों द्वारा पीटा जाए, गोलियां चलें या कानून व्यवस्था की धज्जियां उड़ी हों मगर सनातन की सेवा में कमी नहीं रहनी चाहिए। वाराणसी घाट पर जन्माष्टमी पर वानर सेना को भोजन करवाती पुलिस। जय श्री राम।” దీనిని తెలుగులోకి అనువదిస్తే “ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇక్కడ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినా, ఆర్మీ సైనికులను టోల్ సిబ్బంది కొట్టినా, కాల్పులు జరిగినా, న్యాయవ్యవస్థ దెబ్బతిన్నా సనాతన సేవలో మాత్రం లోటు ఉండకూడదు. వారణాసి ఘాట్ వద్ద జన్మాష్టమి సందర్భంగా పోలీసులు వానరసేనకు భోజనం పెడుతున్నారు. జై శ్రీరాం.”

ఇంకా కొంతమంది వినియోగదారులు కూడా అదే వీడియోను పంచుకున్నారు. వారు తమ ట్వీట్‌లో “జన్మాష్టమి సందర్భంగా వారణాసి ఘాట్ వద్ద వానరసేనకు భోజనం పెట్టిన అద్భుత దృశ్యం, అద్భుతం, ఊహకు అందని దృశ్యం” అని వర్ణించారు.



ఆ క్లెయిమ్‌కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.   

ఫ్యాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్ నిజం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు. అది AI సాయంతో సృష్టించబడింది.

ప్రధాన మీడియా రిపోర్టులను పరిశీలించగా, అలాంటి ఘటన గురించి ఎక్కడా ఎటువంటి వార్తలు వెలువడలేదు. వీడియోలో కూడా అనేక తప్పులు స్పష్టంగా కనిపించాయి. కొన్ని షాట్స్‌లో పోలీసులు టోపీలు ధరించి ఉన్నారు, మరికొన్ని షాట్స్‌లో వారు తలపాగాలు కట్టుకున్నారు. కొందరు పోలీసులు చేతులకు గ్లోవ్స్ వేసుకున్నారు, మరికొందరు మాత్రం లేకుండా నిలబడ్డారు. కాషాయ పతాకాలపై రాసిన పదాలను పరిశీలించగా ఎటువంటి సమాచారం దొరకలేదు. వీడియోలోని నేపథ్య భవనాలు ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కో విధంగా కనిపించాయి.


వైరల్ వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసి AI గుర్తింపు టూల్స్‌లో పరిశీలించాము. Hive Moderation అనే టూల్ ఆ వీడియోను AI ద్వారా సృష్టించబడిందని నిర్ధారించింది.


WasitAI టూల్‌తో కూడా పరిశీలించగా అదే ఫలితాన్ని ఇచ్చింది.


అందువల్ల, ఈ వైరల్ వీడియో నిజం కాదు. ఇది AI సాయంతో సృష్టించబడిన వీడియో మాత్రమే. పోలీసు అధికారులు కోతులకు భోజనం పెట్టిన సంఘటన ఎక్కడా జరగలేదు.

Claim :  వారణాసిలో పోలీసులు జన్మాష్టమి సందర్భంగా కోతులకు భోజనం పెట్టారని ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News