ఫ్యాక్ట్ చెకింగ్: కేరళకు చెందిన BSF అధికారి మ్యాథ్యూ ఇంట్లో 96 కోట్లు నగదు దొరికింది అంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
కేరళకు చెందిన BSF అధికారి మ్యాథ్యూ ఇంట్లో 96 కోట్లు నగదు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న బిఎస్ఎఫ్ కమాండెంట్ మాథ్యూ కేరళ ఇంటి నుంచి సిబిఐ ₹96 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటూ పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"కేరళ వారైన జీబు మాథ్యూ bsf లో కమాండంట్, అతడు కేరళ ఇంటికి వెళ్తుంటే దారిలో పట్టుకున్నారు 76 లక్షలు నగదు దొరికింది.... అతడి ఇల్లు సోదా చెయ్యగా 96 కోట్లు నగదు దొరికింది...
ఇతడి డ్యూటీ బాంగ్లాదేశ్ భారత సరిహద్దులో అట...
అసలు ఎన్ని లక్షల మందిని వీడు మన దేశంలోకి వదిలాడో.... తలుచుకుంటేనే భయమేస్తోంది....
వీడు ఒక్కడి వల్ల అది సాధ్యం కాదు, ఇంకా ఉండి ఉంటారు... అందరిని బైటకు లాగి... ఇలాంటి
దేశ ద్రోహుల్ని పబ్లిక్ గా ఉరి తీయ్యాలి అసలు" అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
మరికొందరు.. "* దేశ రక్షణ యూనిఫార్మ్ ఉన్న వ్యక్తే దేశద్రోహిగా మారాడు ?*
ఇండియాలోకి డబ్బుల కోసం ఎన్ని వేల మంది బంగ్లాదేశీలను అక్రమంగా ప్రవేశించేందుకు ఇతడు సహాయపడివుంటాడో ఊహించండి.
నమ్మశక్యం కాని ఘటన
BSF 83వ బటాలియన్ కమాండెంట్ జిబు బి. మాథ్యూ.
31-02-2018న షాలిమార్ ఎక్సప్రెస్లో ప్రయాణిస్తుండగా, కొచ్చి CBI యూనిట్ అతడిని అరెస్టు చేసింది అతని వద్ద నగదుగా ₹76 లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు అలప్పుజ (అలెప్పీ)లో విచారణ జరిపారు అతడు కేరళలోని పత్తనంతిట్ట జిల్లా నివాసి
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ₹76 లక్షలతో పట్టుబడ్డాడు తర్వాత అతని ఇంటిలో సోదా చేయగా, CBI మొత్తం ₹96 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అతడు పశ్చిమ బెంగాల్ లో ఇండో- బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడింది దాచి పెట్టిన నగదు స్వాధీనం చేసిన దృశ్యాలను చూడండి" అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియో 2018 నుండి ఆన్ లైన్ లో ఉంది.
ఇటీవలి కాలంలో BSF అధికారి ఎవరైనా అరెస్ట్ అయ్యారా? అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే 2018లో అధికారి అరెస్టుకు సంబంధించిన కథనాలు మాకు లభించాయి.
కేరళలోని అలప్పుజ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారి జిబు డి. మాథ్యూను సీబీఐ పట్టుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి ఇంటికి వెళుతుండగా సరిహద్దు భద్రతా దళంకి చెందిన ఒక సీనియర్ అధికారి కేరళలో 45 లక్షల రూపాయల నగదుతో పట్టుబడ్డాడు. కేరళలోని అల్లెప్పీ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన ఆ అధికారిని అరెస్టు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం. సరిహద్దులో స్మగ్లర్ల నుండి వసూలు చేసిన లంచాలకు సంబంధించిన డబ్బు అని అధికారులు తెలిపారు. జిబు డి మాథ్యూ పాకిస్తాన్- బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడే బాధ్యత కలిగిన పారామిలిటరీ దళం BSF లో కమాండెంట్‌గా ఉన్నారు. ఆ అధికారి 82 బెటాలియన్లలో ఒకదానికి నాయకత్వం వహించారు. మిస్టర్ మాథ్యూ నాయకత్వం వహించిన బెటాలియన్‌కు పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ చుట్టూ ఉన్న సరిహద్దు బాధ్యతను అప్పగించారు.
ఈ అరెస్టుకు సంబంధించిన కథనాలు 2018 నుండి ఆన్ లైన్ లో ఉన్నాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. జనవరి 17, 2018న NDTV ఇండియా YouTube ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన వీడియో నివేదికను మేము కనుగొన్నాము. అందులో వైరల్ వీడియోకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. కాన్పూర్‌లోని ఒక ఇంటి నుండి సుమారు 97 కోట్ల రూపాయలు విలువైన రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆపరేషన్ కాన్పూర్ బిల్డర్ నివాసంలో జరిగింది.
పాత కరెన్సీ నోట్లను సేకరించడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారని కాన్పూర్ పోలీసులకు సమాచారం అందింది. ఓ హోటల్‌లో అరెస్టు అయిన వారు అందించిన సమాచారం ఆధారంగా, వ్యాపారవేత్త, బిల్డర్ ఆనంద్ ఖత్రి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఖత్రి ఇంటి నుండి పోలీసులు సుమారు 97 కోట్ల రూపాయల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 17, 2018న స్థానిక కాన్పూర్ జర్నలిస్ట్ చేతన్ గుప్తా ఫేస్‌బుక్ ఖాతాలో కూడా వీడియోను పోస్టు చేశారు. ఒక రహస్య సమాచారం ఆధారంగా, కాన్పూర్ పోలీసులు బిల్డర్ ఆనంద్ ఖత్రి ఇంటి నుండి సుమారు ₹96.62 కోట్ల రద్దు చేయబడిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారని వీడియో నివేదిక పేర్కొంది.
పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ వీడియోను గతంలో డీబంక్ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : వైరల్ వీడియో 2018 నుండి ఆన్ లైన్ లో ఉంది
Claimed By : Social Media Users
Fact Check : Unknown