ఫ్యాక్ట్ చెక్: జరగబోయే అగ్ని ప్రమాదాన్ని కుక్క తెలివిగా నివారించింది అంటూ వైరల్ అవుతున్న వీడియో ఏఐ తో తయారుచేసింది
Viral Dog Saving Family from Fire Video Is AI-Generated, Not Real
జంతువులకు సంబంధించిన AI వీడియోల ప్రచారం ప్రమాదకరమైనది. ఎందుకంటే అవి ప్రజలను తప్పుదారి పట్టిస్తాయి. కొందరు నిజమైనవిగా నమ్మేస్తూ ఉంటారు. జంతువుల ప్రవర్తనపై ప్రజలకు సరైన అవగాహన ఉండదు. పలు జంతువులకు సంబంధించిన నకిలీ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మనుషుల ముందుకు వన్య ప్రాణులు వచ్చిన సంఘటనలు లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. పలు వీడియోలలో వన్య ప్రాణులు, పెంపుడు జంతువులు అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు చూడొచ్చు. ఇవి ప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇవ్వవచ్చు లేదా అనవసరమైన భయాన్ని సృష్టించవచ్చు. వన్యప్రాణుల పట్ల వ్యవహరించే విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
AI-జనరేటెడ్ కంటెంట్ ఎక్కువగా వ్యాపిస్తోంది. వాటి నాణ్యత కూడా అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో ప్రజలు వాస్తవికతకు, కల్పనకు మధ్య తేడాను గుర్తించడం కష్టతరం అవుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్ లాగా కనిపించే వీడియోలు ప్రజలను మోసం చేస్తూ ఉంటాయి. నెటిజన్లు కంటెంట్‌ను ప్రశ్నించకుండా వాటిని నమ్మేస్తూ ఉంటారు. వాటిని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. తప్పుడు సమాచారం వ్యాప్తికి దోహదం చేస్తుంది.
అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాన్ని నివారించే కుక్క గదిలో కూర్చుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క చాలా తెలివైనదని, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని గుర్తించగలిగిందనే వాదనతో 10 సెకన్ల వీడియో వైరల్ అవుతూ ఉంది. ప్లగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం ప్రారంభమవ్వడం చూడొచ్చు. మంటను చూసిన తర్వాత కుక్క సాకెట్ల నుండి ప్లగ్‌లను తీసివేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఆ కుక్క ప్రవర్తించిన తీరును పొగుడుతూ పలువురు వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో AI ద్వారా రూపొందించారు.
వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, ఒక ఫ్రేమ్‌లో వైర్లు ఎలాపడితే అలా ఉన్నాయి, కొన్ని వైర్లు అసంపూర్ణంగా ఉన్నాయని మనం చూడవచ్చు. ఇది AI-జనరేటెడ్ విజువల్స్ చేసేటప్పుడు దొర్లే తప్పులలో భాగం. ఇక్కడ పలు వివరాలు అసంపూర్ణంగా ఉంటాయి.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, AI డిటెక్షన్ సాధనాలను ఉపయోగించి వాటిని తనిఖీ చేసినప్పుడు, వీడియో AI జనరేటెడ్ అని మేము కనుగొన్నాము.
డిటెక్షన్ టూల్ WasitAIతో తనిఖీ చేసినప్పుడు, ఒక ఫ్రేమ్ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించాం. దీని అర్థం విజువల్స్ ఎక్కువగా AI సహాయంతో రూపొందించారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ చూడోచ్చు.
మరొక ఏఐ డిటెక్షన్ టూల్, AIorNot తో తనిఖీ చేసినప్పుడు, ఫ్రేమ్‌లు A.I. జనరేటెడ్ విజువల్స్‌ను సూచిస్తున్నాయని తెలిసింది. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ఇక్కడ చూడొచ్చు.
పెంపుడు జంతువులను లేదా పిల్లలను స్విచ్‌లు ఆన్ చేసి వదిలేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. విద్యుత్ షాక్, కాలిన గాయాలు, మంటలు పుట్టే ప్రమాదం ఉంది. విద్యుత్ ప్రమాదాల గురించి సరైన అవగాహన లేకపోవడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు.
పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు వైర్లను నమిలే అవకాశం ఉంది. విద్యుత్ తీగలు వాటిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. వాటిని నమలడం వల్ల ప్రాణాంతక విద్యుత్ షాక్ లేదా కాలిన గాయాలు సంభవిస్తాయి. పెంపుడు జంతువులు ఫ్రీ స్టాండింగ్ లాంప్‌లు లేదా ఇతర ఉపకరణాలను కూడా కింద పడేయవచ్చు. ఇవి బల్బులను పగలగొట్టి మంటలకు కారణమవుతాయి. ఒక పెంపుడు జంతువు విద్యుత్ ఉపకరణాన్ని నీటి పాత్ర లేదా ఇతర నీటి వనరులలోకి పడవేయవచ్చు, దీని వలన తీవ్రమైన విద్యుద్ ప్రమాదాలు ఏర్పడుతాయి. పెంపుడు జంతువులకు వైర్లు అందుబాటులో లేకుండా PVC పైపుల ద్వారా వైర్లకు రక్షణగా ఉపయోగించవచ్చు. మీరు వాటిని ఉపయోగించనప్పుడు విద్యుత్ తీగలు, ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయడం చాలా మంచిది.
కనుక, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. ఇది నిజం కాదు.
Claim : ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరగబోయే అగ్ని ప్రమాదాన్ని ఒక కుక్క తెలివిగా నివారించడం వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Unknown