గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ఊహించని అంతరాయాలు ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో మౌలిక సదుపాయాలు, వరద నిర్వహణ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది, ఈ సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు శాంటాక్రూజ్ స్టేషన్‌లో 223 మిమీ, కొలాబా స్టేషన్‌లో 110 మిమీ వర్షపాతం నమోదైంది. మలాడ్‌లోని చించోలి వంటి కొన్ని ప్రాంతాలలో 24 గంటల్లో 360 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి, అది కాస్తా రోడ్లపై ప్రభావం చూపించింది. స్థానికంగా రైల్వే సేవలకు కూడా అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలలో కూడా అంతరాయానికి దారితీసింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ముంబై విమానాశ్రయం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంది. చాలా విమానాలను దారి మళ్లించారు లేదా ల్యాండింగ్‌ను ఆలస్యం చేయాల్సి వచ్చింది.
ఇంతలో, నీటితో నిండిన విమానాశ్రయంతో విమానాలు నీటిలో నిలిచి ఉన్నాయని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ముంబై విమానాశ్రయంలోని గందరగోళ పరిస్థితిని చూపిస్తుందని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. “मुंबई एयरपोर्ट पर हाल बेहाल I भारी बारिश से एयरपोर्ट और आसपास जलभराव, कई उड़ानें डायवर्ट व डिले। एयरलाइन्स ने यात्रियों को समय से पहले निकलने और फ्लाइट स्टेटस चेक करने की दी सलाह।“ అంటూ పోస్టులు పెట్టారు. అనువదించినప్పుడు "ముంబై విమానాశ్రయంలో గందరగోళం. భారీ వర్షం, విమానాశ్రయం, పరిసర ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం వల్ల, అనేక విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. విమానయాన సంస్థలు ప్రయాణీకులను ముందుగానే బయలుదేరి విమాన స్థితిని తనిఖీ చేయాలని సూచించాయి" అనేది
దాని అర్ధం అనితెలుస్తోంది.
Full View
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో పాతది. 2023లో వరద నీటిలో మునిగిపోయిన చెన్నై విమానాశ్రయం రన్‌వేను చూపిస్తుంది.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ని ఉపయోగించినప్పుడు, కొంతమంది X వినియోగదారులు డిసెంబర్ 2023లో అదే వీడియోను షేర్ చేశారని, ఇది 2023లో చెన్నై విమానాశ్రయంలో పరిస్థితిని చూపిస్తుందని పేర్కొన్నట్లుగా తెలుసుకున్నాం. ఒక X వినియోగదారుడు "నగరం అంతటా భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోని రన్‌వే నీటితో నిండిపోయింది. తుఫాను తీవ్రతరం కావడంతో తమిళనాడులో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు, విమానాలు రద్దు అయ్యాయి #CycloneMichaung #ChennaiFloods #ChennaiRain #ChennaiRains #India #Cyclone #Michaungcyclone" అనే శీర్షికతో షేర్ చేశారు.
“The current situation at #Chennai Airport, #India. All flights have been canceled until 23:00 local time.” అనే క్యాప్షన్ తో మరొక వినియోగదారుడు డిసెంబర్ 3, 2023న శీర్షికతో వీడియోను షేర్ చేసారు.
“Viral: Chennai airport flooded | Cyclone Michaung | Chennai Severe Cyclonic Storm” అనే టైటిల్ తో టైమ్స్ ఆఫ్ ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో అదే వీడియోను షేర్ చేసింది. మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాల తర్వాత చెన్నై విమానాశ్రయంలో రన్‌వే, విమాన పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోవడంతో విమాన కార్యకలాపాలు నిలిపివేసినట్లు వివరణలో ఉంది.
కనుక, వైరల్ వీడియో ఇటీవలి ముంబై వరదలకు సంబంధించినది కాదు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలను ఇది చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.