ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ బడిలో పందులు తిరుగుతున్న దృశ్యం, వీడియో అరకుది కాదు, తెలంగాణా కి చెందింది
Viral video claiming to show a pig roaming near school in Araku, Andhra Pradesh is old. It’s from Telangana.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు గత ప్రభుత్వం 'మన బడి - నాడు నేడు' పథకం ద్వారా పలు మార్పులకు కారణమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డ్‌లు, పెయింటింగ్ వంటి తొమ్మిది కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా 15,000 కి పైగా పాఠశాలలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ప్రారంభ బడ్జెట్ 12,000 కోట్లుగా భావించారు.
2024లో అధికారం చేపట్టిన టీడీపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వం, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఉచిత యూనిఫామ్‌లు వంటి విస్తృతమైన మౌలిక సదుపాయాల మెరుగుదలలు ఉన్నప్పటికీ, విద్యార్థుల నమోదు 41 లక్షల నుండి 36 లక్షలకు గణనీయంగా తగ్గిందని అంగీకరించింది. ప్రధానంగా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, నాణ్యమైన బోధన పట్ల తల్లిదండ్రుల ప్రాధాన్యత ఇందుకు కారణమని పేర్కొంది.
ఇక కొత్త ప్రభుత్వం ద్వంద్వ వ్యూహాన్ని అవలంబిస్తోంది. ప్రధాన మరమ్మతుల కోసం ₹6,700 కోట్లకు పైగా కేంద్ర నిధులను కోరడం, పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విధంగా మద్దతును కొనసాగించనుంది. కొత్త తరగతి గదుల నిర్మాణం, PM SHRI పథకంలో మరిన్ని పాఠశాలలను చేర్చడం, అదే సమయంలో విద్యా నాణ్యత, పిల్లల నమోదును పెంచడంపై దృష్టి సారించింది.
ఈ నాణ్యమైన సమగ్ర పరిశీలనకు కీలకమైన చొరవలలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడం, పాఠశాలల్లో టాబ్లెట్‌లతో అడాప్టివ్ లెర్నింగ్ (PAL) ల్యాబ్‌లను అందించడం ద్వారా డిజిటల్ అభ్యాసాన్ని విస్తరించడం, జాతీయ విద్యా విధానం (NEP)-2020తో వ్యవస్థను మెరుగ్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లలోపు విద్యార్థుల నమోదును 40 లక్షలకు పెంచే లక్ష్యంతో ఉన్నాయి.
వీటన్నిటి మధ్య, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత పరిస్థితి ఇదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. భోజనం తర్వాత పాఠశాల పిల్లలు తమ ప్లేట్లను కడుగుతున్నట్లు, మురికి నీరు బయటకు వస్తున్నట్లు, ఆ మురికి నీటిలో ఒక పంది తిరుగుతున్నట్లు వీడియో చూపిస్తుంది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయకు చెందిన పాఠశాల అనే వాదనతో వైరల్ చేస్తున్నారు
“ఆంధ్రా స్కూల్స్ ని నాశనం చేసారు కదరా అపుడే
Location :- Aruku village” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రా స్కూల్స్ ని నాశనం చేసారు కదరా అబ్బ కొడుకులు.
Location :- Aruku village
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు. వీడియో లో కనిపిస్తున్న ఆ వాటర్ ఫెసిలిటీ, పాఠశాల నూతన భవనాలు అన్ని జగన్ హయాంలో నాడు-నేడు ద్వారా అభివృద్ధి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒకటి.. ఏడాదిన్నర లోనే నిర్వహణ లేక ఏకంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే యథేచ్ఛగా ప0దులు సంచరిస్తున్నాయి..
పోస్ట్ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడోచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో తెలంగాణలోని ఒక పాఠశాలకు సంబంధించింది. అది ఇటీవలిది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా, అదే వీడియోను తెలంగాణ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెప్టెంబర్ 26, 2023న Xలో పెట్టిన పోస్టు మాకు కనిపించింది. “ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఒక దృశ్యం... పాఠశాలలో పనిచేయని డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఏర్పడిన మురుగునీటి గుంటను పందులు ఆస్వాదిస్తున్నాయి. ఇది ఏ రాష్ట్రంలో ఉందో ఊహించండి?”
మరింత వెతికినప్పుడు, వైరల్ వీడియో సెప్టెంబర్ 2023 లో ఆంధ్రప్రదేశ్ లోని అరకు నుండి వచ్చిందనే వాదనతో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది, కానీ AP ఫ్యాక్ట్-చెక్ విభాగం వీడియోను తోసిపుచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది కాదని పేర్కొంది. డెక్కన్ క్రానికల్ లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, వీడియోలో స్కూల్ యూనిఫాం ధరించిన పిల్లలు కలుషితమైన చోటు నుండి నీటిని సేకరిస్తున్నారు, పాత్రలు కడగడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఫ్యాక్ట్ చెక్ సంస్థ FactCheck.AP.Gov.in ఈ వైరల్ వాదనను తోసిపుచ్చింది. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అరుకు నుండి కాదని, తెలంగాణలోని ఒక ప్రాంతం నుండి వచ్చిందని ట్విట్టర్ పోస్ట్‌లో స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా ఉండాలని ప్రజలను కోరింది. తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడానికి తమ నిబద్ధతను FactCheck.AP.Gov.in విభాగం తమ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి తప్పుదారి పట్టించే, నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి కారణమైన @manishini9 అనే వినియోగదారుడిని తాము గుర్తించామని, వారిపై తదుపరి చర్యలు ప్రారంభించామని స్పష్టం చేసారు.
దిశ డైలీ తెలుగులో సెప్టెంబర్ 17, 2023న ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఈ వీడియో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని చూపిస్తుంది. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పందులు సంచరిస్తున్నాయని ఆ పోస్టుల్లో తెలిపారు. పాఠశాలలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు తమ ప్లేట్లు కడుక్కుంటుండగా, ఆవరణ మురికి నీటితో నిండిపోయింది ఆ నీటిలో పందులు తిరుగుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇటీవల మరోసారి ఈ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దయనీయంగా ఉందని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. ఆ వీడియో 2023 సంవత్సరంలో పొరుగు రాష్ట్రంలోని ఒక పాఠశాలలో జరిగిన పరిస్థితికి సంబంధించినది. ఆ వీడియో అరకులో రికార్డ్ చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే వీడియోను గతంలో రెండు లేదా మూడు సార్లు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. అలాంటి కార్యకలాపాలలో పాల్గొనే వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కనుక, ప్రభుత్వ పాఠశాల దగ్గర మురికి నీటిలో పంది తిరుగుతున్నట్లు చూపిస్తున్న వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అరకుకు చెందినది కాదు. ఇది సెప్టెంబర్ 2023 నాటిది. తెలంగాణలో రికార్డు చేశారు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకులోని ఒక పాఠశాలలో పిల్లల దగ్గర మురికి నీటిలో తిరుగుతున్న పందిని వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Unknown