ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం అమరావతిలో చేరిన వరద నీటిలో నడుస్తున్న ప్రజలను చూపుతోంది అనేది నిజం కాదు
గత కొన్ని నెలలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో 16 చోట్ల 10 సెం
గత కొన్ని నెలలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో 16 చోట్ల 10 సెం.మీ కంటే ఎక్కువ వర్షం నమోదైంది, దీనితో ఆగస్టు 8, 2025న వరద హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సహాయకు చర్యలకు ఉపక్రమించారు. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురవనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని, రాబోయే రోజుల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
మోకాలి లోతు వరద నీటిలో ప్రజలు నడుస్తున్నట్లు చూపించే ఒక చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నుండి వచ్చిన ఇటీవలి చిత్రం అని వాదనతో షేర్ చేస్తున్నారు. “అమరావతిలో మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రజలు” అంటూ పోస్టులు పెడుతున్నారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2024 నాటిది.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి ఈ చిత్రం గురించి వెతికినప్పుడు, అదే చిత్రాన్ని పంచుకున్న అనేక వార్తా కథనాలను కనుగొన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు, వరదల కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అవుట్‌లుక్ ఇండియాలో ప్రచురితమైన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము, రాష్ట్రంలోని సహాయ శిబిరాలకు 45,369 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. NTR జిల్లాలో 24 మంది, గుంటూరులో ఏడుగురు, పల్నాడులో ఒకరు మరణించినట్లు నివేదించారు.
2024 సెప్టెంబర్‌లో బుడమేరు వాగు పొంగిపొర్లినప్పుడు విజయవాడలో వచ్చిన వరదలకు సంబంధించిన చిత్రం పాతదని పేర్కొంటూ FactCheck AP షేర్ చేసిన X పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. “గత ఏడాది (2024) సెప్టెంబర్ లో బుడమేరు వాగు పొంగి విజయవాడలో వరదలు వచ్చాయి. దానికి సంబంధించి మీడియాలో ఆనాడు వచ్చిన ఫోటోను మార్ఫింగ్ చేసి, ఇలా ఫేక్ పోస్టు తయారు చేసారు. రాజధాని అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్రతో ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపైనా, ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్న వారిపైనా చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh” అంటూ పోస్టు పెట్టారు.
డెక్కన్ క్రానికల్ ప్రకారం, వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ, అక్కడి సమీప ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది, భారీ వర్షాల కారణంగా 17000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత భారీ వర్షం నమోదైంది, దీనితో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలను ప్రారంభించింది. సెప్టెంబర్ 2, 2024న విజయవాడ నగరంలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించింది.
కనుక, వైరల్ అయిన చిత్రం ఇటీవలిది కాదు. సెప్టెంబర్ 2024లో విజయవాడను వరదలు ముంచెత్తిన పరిస్థితిని చూపిస్తుంది. ఇది అమరావతి పరిస్థితిని చూపిస్తుందనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద నీటిలో ప్రజలు నడుస్తున్నట్లు వైరల్ చిత్రం చూపిస్తోంది
Claimed By : Social Media Users
Fact Check : Unknown