ఫ్యాక్ట్ చెక్: ఏబీఎన్ టీవీ ఛానల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారనే పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు

ఏబీఎన్ టీవీ ఛానల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారనే

Update: 2026-01-14 03:31 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటిగా చేయాలని భావిస్తూ ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు సమాచారాన్ని ప్రజలు, పెట్టుబడిదారులు సులభంగా పొందేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. కొత్త వెబ్‌సైట్‌లో పరిశ్రమలు, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, గేమింగ్ జోన్లు, నివాస పథకాలు, ప్లాట్ల కొనుగోళ్లు, అనుమతుల కోసం ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.


అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఫ్యూచర్ నగరాన్ని ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్ టెయిన్ మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

"ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియోకి ఫ్యూచర్ సిటీలో ఉచితంగా రూ.100 కోట్ల విలువైన భూమి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ
ఇంకో మూడేళ్లు ఆంధ్రజ్యోతి మద్దతు తనకు ఉండాలని ఆకాంక్షించిన సీఎం
త్వరలోనే కొత్త స్టూడియో శంకుస్థాపనకు హాజరవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని కితాబిచ్చిన ఏబీఎన్ అధినేత
బీఆర్ఎస్ పాలనలో ఏబీఎన్ పై ఆంక్షలు విధించారని గుర్తు చేసుకున్న ఆర్కే
ఆంధ్రలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి మరోసారి గెలుస్తారని జోస్యం

హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి ఏబీఎన్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు. ఈ స్థలంలో ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇంకో మూడేళ్లు ఆంధ్రజ్యోతి తనకు మద్దతుగా ఉండాలని ఆకాంక్షించారు. త్వరలో కొత్త స్టూడియో శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని రాధాకృష్ణ ప్రశంసించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏబీఎన్పై ఆంక్షలు విధించారని గుర్తు చేసిన ఆర్కే ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి మళ్లీ గెలుస్తారని ఆయన అన్నారు." అంటూ ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఉంది.

వైరల్ పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు


వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పోస్టులను డిజిటల్ గా ఎడిట్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఏబీఎన్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించారా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి విశ్వసనీయ నివేదికలు లభించలేదు.


వైరల్ అయిన న్యూస్‌పేపర్ క్లిప్‌ లో 06 జనవరి 2026 తేదీతో పాటు పేజీ నంబర్ 01 ఉన్నట్లు మేము గమనించాము. దీన్ని నిర్ధారించేందుకు మేము 06 జనవరి 2026 నాటి ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్ యొక్క డిజిటల్ కాపీని తనిఖీ చేసాము.


ఈ కథనం వార్తాపత్రికలో ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పేపర్ క్లిప్ ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.


రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ABN ఆంధ్రజ్యోతి 01 జనవరి 2026న ప్రచురించిన
కథనం
లభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వేమూరి రాధాకృష్ణ కలిశారని తేలింది.


వైరల్ అవుతున్న పోస్టులపై ఆంధ్రజ్యోతి సంస్థ, తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించాయి.

"తెలంగాణ ప్రభుత్వం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉచితంగా 25 ఎకరాల భూమిని కేటాయించిందని తప్పుడు ప్రచారం చేశారు. ఆ వార్త పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికను అనుకరిస్తూ ఒక ఫేక్ న్యూస్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రిక అలాంటి వార్తను ప్రచురించలేదు. ఆ వార్త క్లిప్పింగ్ పూర్తిగా కల్పితమైనది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ ఇచ్చిన అధికారిక వివరణ ప్రకారం, నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు ప్రముఖులను కలిశారు. అందులో, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వేమూరి రాధాకృష్ణ కూడా ఒకరు." అంటూ తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చింది.




"ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం.. తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉచితంగా 25 ఎకరాల భూమిని కేటాయించినట్టు ఓ ఫేక్ పోస్టర్ క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అందులో ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియోను నిర్మించనుందని పేర్కొన్నారు. అందుకు ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు." అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 ఎకరాల స్థలాన్ని
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News