ఫ్యాక్ట్ చెక్: పెద్ద పులిపై ఎలుగుబంటి తిరగబడిన విజువల్స్ అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో చోటు చేసుకుంది కాదు

ఈ వీడియో అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు చెందింది కాదు

Update: 2025-06-01 06:40 GMT

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. 2611.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇది దేశంలోని టైగర్ రిజర్వ్‌లలో ఒకటి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అడవిలో ఒక భాగంగా ఉంది. స్లాత్ బేర్స్, చిరుతలు, అడవి కుక్కలు, జింకలు మొదలైన వాటికి ఈ టైగర్ రిజర్వ్ నిలయంగా ఉంది. అమ్రాబాద్ ను 2014లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ రిజర్వ్ పదుల సంఖ్యలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి అంతరించిపోతున్న జాతులకు నిలయంగా ఉంది. అమ్రాబాద్‌లో పులుల మనుగడ, సంరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణముందని నిపుణులు తెలిపారు. 2018లో అమ్రాబాద్‌లో 18 పులులు ఉండగా.. 2022 నాటికి అమ్రాబాద్‌లో 26కు పైగా పెద్దపులులు ఉన్నట్లుగా తేలింది.

తన బిడ్డను కాపాడుకోడానికి ఓ పులి మీద ఎలుగుబంటి తిరగబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో చోటు చేసుకుందంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా నివేదికలను ప్రచురించాయి. 
"కూనను కాపాడుకునేందుకు ఒక ఎలుగుబంటి పెద్దపులిపై తిరగబడింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. అటవీశాఖ అధికారుల కథనం మేరకు.. అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక పెద్దపులి.. ఎలుగుబంటి పిల్లను వేటాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తల్లి ఎలుగుబంటి పెద్దపులి బారినుంచి తన పిల్లకూనను రక్షించుకునేం దుకు సాహసోపేతంగా పోరాడింది. చివరకు పెద్దపులి పలాయనం చిత్తగించింది. అబ్బురపరిచే ఈ దృశ్యాలు.. అటవీశాఖ వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి." అంటూ కథనాలను సాక్షి మీడియా పంచుకుంది.
"నల్లమల అడవుల్లో.. పర్హాబాద్ వద్ద పర్యాటకులకు తారసపడ్డ ఎలుగుబంటి, పెద్దపులి" అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు:

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో చోటు చేసుకున్నది కాదు.

వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు నేషనల్ మీడియా సంస్థలు ఈ ఘటన ఛత్తీస్ఘర్ లో చోటు చేసుకుందంటూ నివేదికలను పంచుకున్నాయి. తెలుగు మీడియాలో ఈ విజువల్స్ వైరల్ అవ్వక ముందే ఈ ఘటనకు సంబంధించిన కథనాలు మాకు లభించాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో గురించి ఇండియా టుడేలో కథనం మాకు లభించింది. ఒక ఆడ ఎలుగుబంటి తన పిల్లను రక్షించుకునే ప్రయత్నంలో పులిని ఎదుర్కొంది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరుగుతున్న పాంగుడ్ ప్రాంతానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. పులి ఎలుగుబంటి పిల్ల వద్దకు రావడంతో, తల్లి ఎలుగుబంటి పులిపై దాడి చేయవలసి వచ్చింది. పులి వెనక్కి వెళ్లి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌ను సమీపంలోని గ్రామస్తులు మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారని నివేదించారు. పలు మీడియా సంస్థలు ఈ ఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుందంటూ నివేదికలను పంచుకున్నాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఇక తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ బృందం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులను కూడా సంప్రదించింది. ఈ వీడియో ఇక్కడ చోటు చేసుకుంది కాదని వివరణ ఇచ్చారు. వైరల్ ఘటన ఎక్కడ జరిగిందో తెలుగుపోస్టు స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, నల్లమల అడవుల్లో చోటు చేసుకున్న ఘటన కాదని తెలుగుపోస్ట్ ధృవీకరించింది. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim :  ఈ వీడియో అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు చెందింది కాదు
Claimed By :  Social Media Users, Media
Fact Check :  Unknown
Tags:    

Similar News