ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ కలకలం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ కలకలం అంటూ
హైదరాబాద్ లోని పలు అపార్ట్మెంట్ల లోకి ఓ అమ్మాయి ప్రవేశించి పిల్లలకు చాకోలెట్స్ ఆశచూపించి అపహరిస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ యువతి నల్లటి స్వెట్‌షర్ట్, నలుపు-బూడిద రంగు ఫ్రేమ్డ్ గ్లాసెస్ ధరించి, చాక్లెట్లతో నిండిన 'బోల్డ్‌ఫిట్' బ్రాండెడ్ బ్యాగ్‌ను ధరించి ఉంది. అనుమానిత బాలిక సమీపంలోని పలు సొసైటీలలో కూడా ప్రవేశించినట్లు వాట్సాప్ లో పోస్టులు పెట్టారు. సకాలంలో గార్డు అప్రమత్తంగా ఉండటం వల్ల, ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. సొసైటీ నివాసితులు ఇప్పుడు పిల్లల భద్రత విషయంలో మరింత జాగ్రత్త వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గార్డులు ఉన్న అన్ని సొసైటీలు కూడా ఈ సంఘటన గురించి అప్రమత్తంగా వ్యవహరించాలంటూ ఆ పోస్టుల్లో పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ గమనించవచ్చు
ముఖ్యంగా హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ కిడ్నాప్ రూమర్ విస్తృతంగా వ్యాపించింది. 20 ఏళ్ల మహిళ పిల్లలను చాక్లెట్లతో ఆకర్షిస్తూ గేటెడ్ కమ్యూనిటీల్లోకి ప్రవేశిస్తోందని సందేశాలు వైరల్ అయ్యాయి
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు లభించలేదు.
ఇక మా తదుపరి పరిశోధనలో ఇదే ఫోటోలోని విజువల్స్ లో ఉన్న అమ్మాయి నోయిడాలో కూడా కిడ్నాప్ లకు ప్రయత్నించిందంటూ కొన్ని పోస్టులు కనిపించాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఓ రూమర్ పలు ప్రాంతాలలో వైరల్ అవుతూ ఉంది.
ఇక మేము హైదరాబాద్ పోలీసు అధికారులను సంప్రదించాం. అయితే ఇలాంటి ఘటన ఏదీ హైదరాబాద్ లో చోటు చేసుకోలేదంటూ వివరించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఈ ప్రచారాన్ని తప్పుడు వార్తగా ప్రకటించారు. ప్రజలు నిర్ధారణ చేయని సందేశాలను నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయకండని ఆయన కోరారు. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు గమనించినా పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. అధికారిక సమాచారాన్ని నమ్మాలని కోరారు సజ్జనార్.
హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ కిడ్నాప్ రూమర్ విస్తృతంగా వ్యాపించింది. 20 ఏళ్ల మహిళ పిల్లలను చాక్లెట్లతో ఆకర్షిస్తూ గేటెడ్ కమ్యూనిటీల్లోకి ప్రవేశిస్తోందని సందేశాలు వైరల్ అయ్యాయి. ఏఐతో రూపొందించిన ఫోటోను జతచేసి అలర్ట్ పేరుతో ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇక ఈ మెసేజ్‌లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించగా, అలాంటి ఘటన ఏదీ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. రైన్బో విస్టాస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ వార్తను ఖండించింది. ఈ ప్రచారంలో రైన్బో విస్టాస్ (మూసాపేట్), మ్యాప్స్కో కాసాబెల్లా, సఫైర్ 83, అపర్ణ వైఖాన్ సఫైర్ 83 వంటి అపార్ట్‌మెంట్ పేర్లు ప్రస్తావించారు. కొన్ని హైదరాబాద్‌లో ఉండగా, మరికొన్ని బెంగళూరులో ఉన్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.