ఫ్యాక్ట్ చెక్: భారతదేశంలో ఎలాంటి లాక్ డౌన్ ను విధించడం లేదంటూ స్పష్టం చేసిన కేంద్రం

భారతదేశంలో ఎలాంటి లాక్ డౌన్ ను విధించడం లేదంటూ స్పష్టం చేసిన కేంద్రం

Update: 2026-03-27 09:15 GMT

భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించబోతున్నారంటూ అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇవి దేశంలోని పలు ప్రాంతాలలో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని పలు వాదనలు చేస్తున్నారు. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ గురించి చేసిన ప్రసంగాల ఆధారంగా ఈ వదంతులు పుట్టుకొచ్చాయి. ఆయన కోవిడ్-19 సమయంలో లాక్‌డౌన్‌లను ప్రకటించినప్పుడు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే ఈ వ్యాఖ్యలు కూడా ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.


కొన్ని మీడియా సంస్థలు కూడా లాక్ డౌన్ విధించబోతున్నట్లుగా వీడియోలను అప్లోడ్ చేశాయి.



 


వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది




 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించబోతున్నట్లుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ఈ లాక్ డౌన్ వార్తలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం, వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం బాధ్యతారహితమైన చర్య, హానికరమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఇంధనం, సరఫరా వ్యవస్థలు, నిత్యావసరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు ఇంధనం, ఇతర నిత్యావసరాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు.



పలు మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంఘర్షణ కారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను మూసివేయడంతో, అనేక పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు భయాందోళనతో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాలో కొరత ఏర్పడటంతో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించవచ్చనే వదంతులు తలెత్తాయి. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నందున భారతదేశ ఇంధన పరిస్థితి సురక్షితంగా ఉందని కేంద్ర మంత్రి పూరి ధృవీకరించారు. మన పౌరులకు ఇంధనం, ఇతర కీలకమైన సరఫరాలు నిరంతరాయంగా లభించేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పినట్లుగా మీడియా కథనాలు ఉన్నాయి. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో భారతదేశం స్థైర్యాన్ని ప్రదర్శించిందని, రాబోయే కాలంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని కేంద్రం చెప్పినట్లుగా మీడియా నివేదికలు వచ్చాయి.

మీడియా నివేదికలకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఇక మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వదంతులను ఖండించారు. "లాక్‌డౌన్ ఉండదని నేను ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. లాక్‌డౌన్ ఉంటుందని, ఇంధన కొరత ఏర్పడుతుందని కొందరు నాయకులు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవి నిరాధారమైనవి. రాజకీయ రంగంలో ఉన్నవారి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ సమయంలో మనం చూసినటువంటి లాక్‌డౌన్ ఉండదని నేను ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను," అని ఆమె అన్నారు.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను భారతదేశంలో విధించడం లేదు.


Claim :  భారతదేశంలో లాక్ డౌన్ విధించనున్నారు. అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Claimed By :  Social Media Users, Media Outlets
Fact Check :  Unknown
Tags:    

Similar News