ఫ్యాక్ట్ చెక్: జెరూసలేంలో అడవులు కాలిపోతున్న వీడియోను ఇరాన్ దాడుల సమయంలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు
వైరల్ అవుతున్న వీడియో జెరూసలేంలో అడవులు కాలిపోతున్న ఘటనకు సంబంధించింది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను కొనసాగిస్తూ ఉంది. దీంతో గల్ఫ్ అంతటా రక్షణ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇరాన్‌లోని రెండు ప్రధాన ఉక్కు కర్మాగారాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఈ తాజా దాడులు జరిగినట్లు కనిపిస్తున్నాయి. టెహ్రాన్ గల్ఫ్‌లోని పలు పారిశ్రామిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. అబుదాబిలోని తమ అల్ తవీలా ఉత్పత్తి కేంద్రానికి నష్టం వాటిల్లిందని ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం ధృవీకరించింది. ఇక ఒక్కరోజే తమ వ్యవస్థలు 20 బాలిస్టిక్ క్షిపణులను, 37 డ్రోన్‌లను అడ్డుకున్నాయని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఆ దేశం దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు, సుమారు 1,900 డ్రోన్‌లను ఎదుర్కొందని స్పష్టం చేసింది.
జెరూసలేం సమీపంలోని ఎష్టావోల్ పట్టణంపై ఇరాన్‌కు చెందిన ఒక బాలిస్టిక్ క్షిపణి దాడి చేసింది. దీనివల్ల నివాస భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు, పలువురు పౌరులు గాయపడ్డారు. అత్యవసర సహాయక బృందాల ప్రకారం, ఈ దాడి కారణంగా అనేక ఇళ్ల నిర్మాణాలు దెబ్బతిన్నాయి. శిథిలాలు, పేలుడు ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడింది. పేలుడు ధాటికి కిటికీలు పగిలిపోయాయి, ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి, శిథిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురయ్యాయి. దాడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, గాయపడిన వారి సంఖ్య స్వల్పంగానే ఉందని, చాలా మందికి అక్కడికక్కడే చికిత్స అందించారని నివేదికలు చెబుతున్నాయి.
హైవే సమీపంలో భారీ అగ్నిప్రమాదం, పొగకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఈ సంఘటన 2026 మార్చి 26న జెరూసలంలో జరిగిందని పలు యూజర్లు పేర్కొన్నారు.
“బ్రేకింగ్: జెరూసలం సమీపంలో ఘోర సంఘటన జెరూసలం వైపు వెళ్లే లాట్రూన్ రోడ్డుపై ఈరోజు భారీ అగ్నిప్రమాదం, దట్టమైన పొగతో గందరగోళం నెలకొనడంతో వాహనదారులు అక్కడి నుండి పరుగులు తీశారు.” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొగ నుండి తప్పించుకోవడానికి వాహనదారులు, ప్రయాణికులు తమ వాహనాలను వదిలి రహదారి వెంబడి నడుస్తూ కనిపిస్తున్నారు. ఇజ్రాయెల్ అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దట్టంగా కమ్ముకుంటున్న పొగను బట్టి చూస్తే రహదారి పక్కన ఏదో ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది.
వైరల్ వీడియో లోని కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. ఏప్రిల్ 30, 2025న ప్రచురించిన ఒక నివేదిక మాకు లభించింది. వైరల్ వీడియోలోని స్క్రీన్‌షాట్‌లను పోలిన ఒక ఫోటో ఉంది.
వైరల్ వీడియో లోని వీడియోను ఇక్కడ చూడొచ్చు. 2025 ఏప్రిల్ నెలలో వైరల్ వీడియోను పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోకు ఇరాన్ చేసిన దాడుల వలన జెరూసలేంలోని పలు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయనే వాదనకు ఎలాంటి సంబంధం లేదు.
2025, ఏప్రిల్ నాటి వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు.