ఫ్యాక్ట్ చెక్: ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా ఉన్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా
ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. రాహుల్ గాంధీ కోజికోడ్‌లో ఒక భారీ ర్యాలీతో పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రణాళికలు మారాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కేరళ చేరుకున్నారు.
2026 మార్చి చివరి వారంలో సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి ఆసుపత్రిలో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఆ ఫోటోతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిశారనే వాదనలు ప్రచారంలో ఉన్నాయి.
జనవరి 2026లో కూడా సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల ఆరోగ్యం క్షీణించడంతో సోనియా గాంధీని అర్థరాత్రి సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించగా, కొన్నిరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. చలి వాతావరణం, కాలుష్యం ఆమె బ్రోన్చియల్ ఆస్తమాను తీవ్రతరం చేశాయని, దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని డాక్టర్లు తెలిపారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొన్నిరోజులపాటు ఆమె తన నివాసంలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోనియా గాంధీని పరామర్శించారా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అయితే ఎక్కడా కూడా మాకు అందుకు సంబంధించిన నివేదికలు లభించలేదు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ జ్వరంతో మార్చి 24 రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ప్రస్తుతం, వైద్యులు కడుపు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల గురించి పలు పరీక్షలు చేశారు. ఇప్పటికే సోనియా గాంధీకి యాంటీబయాటిక్స్ కోర్సు ప్రారంభమైంది. వాతావరణ మార్పు కారణంగా కాంగ్రెస్ నాయకురాలు అస్వస్థతకు గురై ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని పరామర్శించినట్లుగా ఎలాంటి నివేదికలు మాకు లభించలేదు. అదే చేసి ఉండి ఉంటే మీడియాలో ప్రముఖంగా నివేదించి ఉండేవారు. ఇక వైరల్ అవుతున్న ఫోటోను నిశితంగా పరిశీలించగా అందులో ఎన్నో తప్పులు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ చిత్రం నిజమైనదా లేక AI ద్వారా సృష్టించారా అని నిర్ధారించడానికి, మేము దానిని Hive ఏఐ డిటెక్షన్ సాధనాలను ఉపయోగించి పరిశీలించాము. ఆ చిత్రం AI ద్వారా సృష్టించబడిందని స్పష్టం చేసింది.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇక జెమినీ ఏఐ టూల్ కూడా వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారని తెలిపింది.
కాబట్టి, ఏఐ ఫోటోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు.
Claim : ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీని పరామర్శించారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown